కోహ్లీతో మాట్లాడాలంటే భయమేసింది
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) తన బ్యాటింగ్‌లోని ఓ కీలక లోపం గురించి మాట్లాడేందుకు ఎంతో ఆలోచించాల్సి వచ్చిందని భారత జట్టు మాజీ సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు. ఎంతటి గొప్ప ఆటగాడైనా ఫామ్ కోల్పోయినప్పుడు సరైన సూచనలు ఇవ్వడం కోచ్ బాధ్యత అని, అయితే కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడికి సలహాలు ఇవ్వడం అంత సులభమైన విషయం కాదని అభిప్రాయపడ్డాడు. ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా, అతడి ఆటతీరులో మెరుగుదల తీసుకొచ్చేలా మాట్లాడటం కోచ్‌లకు పెద్ద సవాలుగా మారుతోందని తెలిపాడు.
2024-25లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లీ టెస్టు క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ అవతల పడుతున్న బంతులను డ్రైవ్ (Off-side Drive) చేయడానికి ప్రయత్నిస్తూ పదేపదే వికెట్ కోల్పోయాడు. ఆ సిరీస్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ ఎనిమిదిసార్లు క్యాచ్ రూపంలోనే పెవిలియన్‌కు చేరడం అతడి బ్యాటింగ్‌లోని సమస్యను స్పష్టం చేసింది. ఈ బలహీనతను గుర్తించిన టెన్ డస్కటే.. నాలుగో టెస్టు సందర్భంగా కోహ్లీతో దీనిపై చర్చించాలని నిర్ణయించుకున్నాడు.
అయితే కోహ్లీ దగ్గరకు నేరుగా వెళ్లి అతడి బ్యాటింగ్‌లోని లోపాలను ప్రస్తావించడం సరైన పద్ధతి కాదని టెన్ డస్కటే భావించాడు. అందుకే ఏ సమయంలో మాట్లాడాలి? ఏ విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాలి? అన్న విషయాలపై ముందుగానే ఆలోచించాడు. చివరకు వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిన సమయంలో కోహ్లీతో మాట్లాడేందుకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా తన సూచనలను కోహ్లీ సానుకూలంగా స్వీకరించాడని, ఇద్దరి మధ్య మంచి చర్చ జరిగిందని వెల్లడించాడు.
ఇదే సందర్భంలో ఆధునిక క్రికెట్లో కోచ్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఆయన ప్రస్తావించాడు. ఆటగాళ్లతో వారి లోపాలు, బలహీనతల గురించి మాట్లాడేందుకు చాలామంది కోచ్‌లు వెనుకాడుతున్నారని తెలిపాడు. ఆటగాళ్ల ఆటతీరులో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారనే భావన కలుగుతుందేమోనని, తమ ఉద్యోగాన్ని సమర్థించుకోవడానికే సూచనలు చేస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతుందేమోనని కోచ్‌లు ఆందోళన చెందుతున్నారని వివరించాడు.
ఒక ఆటగాడికి ఉపయోగపడే సలహా ఇవ్వడం, అదే సమయంలో అతడిని మరింత గందరగోళానికి గురిచేయకుండా చూడటం మధ్య చాలా సున్నితమైన వ్యత్యాసం ఉంటుందని టెన్ డస్కటే అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లకు జట్టులో పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో కోచ్‌లు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు కూడా సంకోచిస్తున్నారని వివరించాడు.