హుజురాబాద్లో అట్టహాసంగా రావణ దహనం
హుజురాబాద్ డివిజన్లో అంబరాన్నంటిన విజయదశమి సంబరాలు..
అట్టహాసంగా రావణ దహనం!
చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక
మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్రావు
హుజురాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్రావు(Municipal Chairperson Rontala Suhasini Manoj Rao) అన్నారు. దశమి రోజున చేపట్టే కార్యక్రమాలు విజయాన్ని అందిస్తాయనే నమ్మకంతో ప్రజలు ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో(Devotional), ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలను(Vijayadashami celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ ఆచార్య, రామన్న అయ్యగార్లు సంప్రదాయబద్ధంగా శమీ పూజ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్రావు, పాలకవర్గ సభ్యులు కలిసి రావణాసురుడి ప్రతిమకు నిప్పంటించి రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రావణ దహనాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హుజురాబాద్ ఏసీపీ మాధవి, పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణలో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి.
కాగా, వేడుకల్లో చివరిగా హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన రామ్లీలా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్లీలా ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో కళాకారుల పాటలు, సంగీతం ప్రేక్షకులను అలరించడంతో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి.