యూనివర్సిటీ వ్యక్తిగత ఆస్తి కాదు
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఆస్తులు
చింతల అశోక్ మాదిగ, ఎంఎస్ఎఫ్ శాతవాహన యూనివర్సిటీ అధ్యక్షుడు
కరీంనగర్ క్రైం, నవంబర్13 (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా ఆస్తి అని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ శాతవాహన యూనివర్సిటీ(Madiga Student Federation, Satavahana University) అధ్యక్షుడు చింతల అశోక్ మాదిగ(Chinthala Ashok Madiga) స్పష్టం చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి(University Development) పేరుతో జరుగుతున్న మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేతపై శుక్రవారం ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ తరఫున యూనివర్సిటీ అధికారులకు పలు సూటి ప్రశ్నలు సంధించారు. యూనివర్సిటీలో మట్టి తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఇప్పటివరకు ఎన్ని వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు? ఎన్ని చెట్లను నరికివేశారు? ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? జరుగుతున్న పరిణామాలను యూనివర్సిటీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అనే ప్రశ్నలకు అధికారులు విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చెట్ల నరికివేతపై అటవీ శాఖ ప్రత్యేకంగా విచారణ జరపాలని కోరారు. యూనివర్సిటీ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు జరిగిన నష్టంపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన యూనివర్సిటీ ఆస్తులను కాపాడుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అశోక్ మాదిగ తెలిపారు.
అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకునే వరకు విద్యార్థి సమాజం తరఫున తమ ప్రశ్నలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రకృతిని నాశనం చేసే అభివృద్ధి తమకు అవసరం లేదని, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి మారేపల్లి రాజు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.