కరీంనగర్‌లో రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ

22-11-2026 | 11:16am

కరీంనగర్, నవంబర్ 21 (విజయక్రాంతి): భారత న్యాయరంగంలో తన అసాధారణ ప్రతిభ, అపార న్యాయపరిజ్ఞానం, వాదనా పటిమతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి, భారత బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ దివంగత రామ్ జెఠ్మలానీకి కరీంనగర్‌లో ఘన నివాళి అర్పించారు. కరీంనగర్‌లోని కుమారయ్య కాలేజ్ ఆఫ్ లా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సూర్యకాంత్ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పుల్లిచెర్ల సామ్ కోషి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్, రామ్ జెఠ్మలానీ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు స్వామినాథన్ గురుమూర్తి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా న్యాయ దిగ్గజం రామ్ జెఠ్మలానీ సేవలను స్మరించుకున్నారు. ఆయన విగ్రహావిష్కరణ (Statue Unveiling) కార్యక్రమం న్యాయవాదులు, న్యాయ విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. కుమారయ్య కాలేజ్ ఆఫ్ లా కరస్పాండెంట్ డాక్టర్ కె. జలజ, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు పూరెల్ల రాములు, సుంకే దేవకిషన్, బెజ్జంకి శ్రీకాంత్, పి. అనురాధ, గౌరు రాజిరెడ్డి, పెరుక రంగయ్య, భూక్య రజనీష్, ఏ. కిరణ్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు