15వ బెటాలియన్‌ను తనిఖీ చేసిన డీఐజీ మురళీ కృష్ణ
సత్తుపల్లి నవంబర్13( విజయ క్రాంతి ) : మండల పరిధిలోని గంగారం గ్రామం(Gangaram Village) లో గల 15వ బెటాలియన్ లో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ డిఐజి మురళీకృష్ణ(Murali Krishna, DIG, Telangana Special Police Battalions) వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా బెటాలియన్ సిబ్బంది ప్రదర్శించిన కవాతును ఆయన పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కవాతును పరేడ్ కమాండర్ బి. వేణుగోపాల్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహించారు.
అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు, అంకితభావం మొత్తం పోలీసు వ్యవస్థకే వన్నె తెస్తున్నాయని ప్రశంసించారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ వ్యవస్థ దేశ పోలీసు వ్యవస్థకే వెన్నెముక వంటిదని కొనియాడారు.
అనంతరం బెటాలియన్ అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో పాల్గొని, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా బెటాలియన్‌లోని శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ఎన్. పెద్దబాబు అదనపు కమాండెంట్ ఏ. అంజయ్య , సహాయ దళాధిపతి బి. వినాయకరావు ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.