మాది పేదల పక్షపాత ప్రభుత్వం

13-11-2026 | 10:19pm

* అందుకే రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లిచ్చాం 

* కొత్తగా చేయుత పింఛన్లు మంజూరు చేసిన లబ్ధిదారులకు ఈనెల 19 నుంచే ఆర్థిక తోడ్పాటు 

* కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం

* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

* కూసుమంచి మండలంలో 1,071 మందికి, ఖమ్మం రూరల్ మండలంలో 851 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ 

కూసుమంచి/ ఖమ్మం రూరల్: ఈ ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని, నిరంతరం వారి సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. చేయూత పథకంలో(Cheyutha Scheme) భాగంగా కూసుమంచిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) మైదానంలో 1,071 మందికి, ఖమ్మం రూరల్ మండలంలోని ఎం.వెంకటాయపాలెం గ్రామంలోని హైస్కూల్ గ్రౌండ్ లో 851 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయా సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు, హైదరాబాద్ లో లక్ష ఇళ్లను పేదలకు కేటాయించామని, ఫైనల్ బిల్లులను ఈ నెలలోనే మంజూరు చేస్తామని ప్రకటించారు. గత పాలకులు పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, ఎనిమిదేళ్లలో ఒక్క పింఛన్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు.

తమ ప్రజా ప్రభుత్వంలో చేయూత పింఛన్ల కోసం మంజూరు పత్రాలు అందజేస్తున్నామని, ఈనెల 19వ తేదీ నుంచే లబ్ధిదారులకు ఆర్థిక భరోసా అందిస్తుందని ప్రకటించారు. కూసుమంచి కేంద్రంలో వంద పడకల ఆసుపత్రితో పాటు కొట్లాది నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ తొత్తుగా మారి 7కోట్ల ఓట్లను తొలగించారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు. 

ఈ కార్యక్రమాల్లో..: కాంగ్రెస్ పార్టీ కూసుమంచి మండల అధ్యక్షులు బజ్జురి వెంకటరెడ్డి, ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు తోట వీరభద్రం, పలువురు అధికారులు, సర్పంచ్ లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు