ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం

03-11-2026 | 04:03pm
  1. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్,  శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  2. ఏదులాపురం మునిసిపాలిటీ 14, 15, 16 వార్డులలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ఖమ్మం/ఏదులాపురం, నవంబర్ 3(విజయ క్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం(People's Government) ఏర్పాటైన నాటి నుండి పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister for Information and Public Relations, Ponguleti Srinivasa Reddy) అన్నారు.

మంగళవారం ఏదులాపురం మునిసిపాలిటీ 14,15,16 వార్డులు తెల్దార్ పల్లి లో రూ. 312.90 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.‌. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షంలోనూ ప్రజలు చూపిన ఆదరాభిమానాలు ఈ ప్రభుత్వంపై వారికున్న ప్రేమను చాటుతున్నాయన్నారు.

తెల్లవారుపల్లి లో  మూడు డివిజన్ల పరిధిలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల కోసం పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని తెలిపారు. గత 33 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కేవలం తెల్లవారుపల్లి ప్రాంత పరిధిలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 16.86 కోట్లు వెచ్చించి శంకుస్థాపనలు, పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.  

అలాగే, తెల్దారుపల్లి లో మొత్తం 105 ఇందిరమ్మ ఇళ్లను రూ. 5.25 కోట్లతో మంజూరు చేయడం జరిగిందని, పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం ద్వారా పేదవాడి గుమ్మానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం,

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు ఎకరానికి రూ. 12,000 రైతు భరోసా ఆర్థిక సహాయం,  తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ, ఆసరా పింఛన్లు, నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల క్రింద రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. 

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో భాగంగా గడచిన 33 నెలల్లో రూ. 73 వేల కోట్లు సున్నా వడ్డీకే మహిళలకు అందించామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేస్తున్నామన్నారు. 

భూముల సమగ్ర సర్వే, అర్హులైన రైతులందరికీ 'భూధార్' కార్డుల జారీ

రాష్ట్రంలో సుమారు 125 సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగిందని, ఈనాడు రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగుళాన్ని సర్వే చేసి భూములున్న ఆసాములకు పూర్తి భరోసా కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ సర్వేను వెంటనే చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.

తెల్దారుపల్లి లో రాబోయే కొద్ది రోజుల్లోనే గ్రామమంతా సర్వే చేయించి, అర్హులైన వారందరికీ న్యాయబద్ధమైన భూములను కేటాయించనున్నామ న్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి క్యూఆర్ కోడ్, మ్యాప్‌తో సహా, ప్రతి మనిషికి ఆధార్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ప్రతి భూమికి భూధార్ ను మ్యాప్‌తో సహా అందిస్తామని మంత్రి తెలిపారు.

తెల్దారుపల్లి ప్రాంత ప్రజల కొరకు నాగార్జున సాగర్ కాల్వపై రూ. 5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి కూడా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రి అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, గడిచిన ఒక నెల, నెలన్నర రోజుల్లోనే ఎదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్‌లో దాదాపు రూ. 35 నుండి 40 కోట్ల వరకు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. యంత్రాంగం తరఫున ప్రతి ఒక్క పనిని చాలా త్వరగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మునిసిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు