జలసిరి పనులను వేగవంతంగా చేయాలి
- ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా ప్రోత్సహించండి
- మండల పరిషత్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ సీఈవో నరేందర్
సుల్తానాబాద్, నవంబర్ 03 (విజయ క్రాంతి): జలసిరి పనులను వేగవంతంగా చేపట్టి ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని జిల్లా పరిషత్ సీఈవో కె.నరేందర్(Zilla Parishad CEO K. Narender) అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సిబ్బంది సకాలంలో కార్యాలయంకు హాజరుకావాలని ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తుల త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీ సిబ్బంది తో మాట్లాడుతూ జలసిరి పనులు వేగవంతం చేయాలని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కట్టేలా ప్రోత్సహించాలని ప్రతి గ్రామంలో పంట కుంటలు, నీటి కుంటల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఉపాధి హామీ లేబర్ టార్గెట్ ప్రకారం రావాలని, జాబ్ కార్డు లేని వారు పనికి రావడానికి ఆసక్తి చూపేవారికి కొత్త జాబ్ కార్డులు వెంటనే జారీ చేయాలని, కొత్తగా మంజూరి అయిన వివో భవనాల పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో నీలగిరి దివ్యదర్శన్ రావు, ఎంపీఓ ఈ. మౌనిక , కార్యాలయ పర్యవేక్షకులు ఫక్రుద్దీన్, ఏపీవో మల్లీశ్వరి, ఉపాధి హామీ జె.ఈ రాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.