బ్రతికినన్నాళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం
తల్లాడ పెన్షన్ల పంపిణీలో ఓ మహిళ కన్నీటి గాధ
ఎమ్మెల్యే రాగమయి దంపతులు కంటతడి
తల్లాడ. సత్తుపల్లి నవంబర్ 13( విజయక్రాంతి ) : నా కుమారుడు అరుదైన తలసేమియా వ్యాధితో(Thalassemia disease) బాధపడుతున్నాడు. అతన్ని బ్రతికించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో ఏళ్లు గడిచాయి.. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. అయినా కూడా ఏ ప్రభుత్వము కనికరించలేదు. నాలాంటి వాళ్లు ఈ రాష్ట్రంలో చాలామంది అమ్మల అందరి బాధలను ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) విన్నాడో.. ఏమో కానీ.. నాలాంటి కుమారులకు నూతనంగా పెన్షన్(Pension) అందించి, బ్రతుకుతాడన్న భరోసా కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కి మేము బ్రతికినంత కాలం రుణపడి ఉంటామంటూ ఓ మహిళ కాళ్ళ మీద పడి కన్నీటి పర్యంతమైన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడలో చోటుచేసుకుంది. తల్లాడలో నూతన పెన్షన్ల మంజూరి పత్రాలను అందించే కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామిరెడ్డి సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి , దయానంద్ దంపతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తన బాధను వెలిబుచ్చేందుకు మాట్లాడేందుకు స్టేజి పైకి వచ్చిన తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన కృష్ణవేణి తన బాధను చెప్పుకుంటూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి రుణపడి ఉంటాను.. అన్న మాటలు.అక్కడున్న ఎమ్మెల్యే దంపతులతో పాటు సభికుల కళ్ళల్లో నుంచి కన్నీరు కారాయి.
తలసేమియా వ్యాధితో తనతో పాటు రాష్ట్రంలో అనేకమంది తల్లులు బాధపడుతున్నారని, ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్పించి, నాలాంటి తల్లులకు కుమారులను బ్రతికించాలని, దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ముఖ్యమంత్రికి కన్నీరు ద్వారా విన్నవించారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే దంపతులు, హాజరైన మహిళలందరూ కన్నీటి పర్యంతమయ్యారు
కంటతడి పెట్టిన దయానంద్.
తలసేమియా వ్యాధితో తన కుమారుడు అనేక ఇబ్బందులు పడుతున్నాడని, కుమారున్ని బ్రతికించాలని ప్రసంగించిన ఆ మహిళ మాటలు విన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత మట్టా దయానంద్ చలించిపోయారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో తలసేమియా వ్యాధితో తన కూతురు కూడా మరణించిందని, ఇటువంటిది రాష్ట్రంలో ఏ తల్లులకు కూడా జరగకూడదని సబ్దత హృదయంతో నిమిషం పాటు కంటతడి పెట్టారు.
అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే మట్టా రాగమయి తమ కూతురు కూడా ఆ వ్యాధితో చనిపోయిందని, ఆమె పేరు మీదనే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ఈ తలసేమియా వ్యాధి గురించి పార్లమెంటులో మాట్లాడాలని పక్కనే ఉన్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి కి సభాముఖంగా తెలియజేశారు.