రూ.25 లక్షల విలువైన గంజాయి పట్టివేత
- ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా..
- సూర్యాపేట పోలీసుల చాకచక్యంతో ముఠా గుట్టురట్టు
- ఎస్కార్ట్ కారుతో నిఘా పెడుతూ సరుకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా
- గంజాయి అక్రమ రవాణాపై ఉపేక్షించేది లేదు_ జిల్లా ఎస్పీ కె. నరసింహ
సూర్యాపేట , నవంబర్ 13 (విజయక్రాంతి) : ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.25 లక్షల విలువైన 112 కిలోల గంజాయిని సూర్యాపేట టూ టౌన్ పోలీసులు(Suryapet Two Town Police) స్వాధీనం చేసుకుని, ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ శుక్రవారం విలేకరులకు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఐదుగురు వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టి, ఒడిశాలోని జగన్నాథపురి ప్రాంతంలో రూ.2.24 లక్షలకు 112 కిలోల గంజాయి కొనుగోలు చేసి 41 ప్యాకెట్లుగా మార్చి ఇన్నోవా కారులో లోడ్ చేశారు.
పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ముందుగా మరో ఎర్టిగా కారును ఎస్కార్ట్గా నడుపుతూ తరలిస్తుండగా, నవంబర్ 7న సూర్యాపేట శివారులోని ఎన్ హెచ్-65 పద్మావతి ఫంక్షన్ హాల్ వద్ద ఇన్నోవా కారు బ్రేక్డౌన్ కావడంతో నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు.
అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారును తనిఖీ చేసిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయగా, తిరిగి ఆ వాహనాన్ని తీసుకెళ్లేందుకు నవంబర్ 12న సూర్యాపేటకు వచ్చిన మహారాష్ట్రకు చెందిన ఆకాష్ విజయ్ దాబేకర్ (23), ఆకాష్ దిలీప్ మోరే (32)లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు జప్తు చేసి రిమాండ్కు తరలించారు.
పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్సైలు గోపికృష్ణ, రామచందర్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.