విధులకు డుమ్మా.. విందు వినోదాల్లో మున్సిపల్ ఉద్యోగులు
కాగజ్‌నగర్ (విజయ క్రాంతి): ప్రజలకు సేవలందించాల్సిన మున్సిపల్ (Municipal) ఉద్యోగులు విధులను పక్కనపెట్టి విందు వినోదాల్లో మునిగితేలిన ఘటన కాగజ్‌నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి ఆధ్వర్యంలో ఉద్యోగులకు సిర్పూర్ (టి) మండలంలోని పెద్దబండ అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయం వద్ద విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ప్రజల వివరాలను ఆన్లైన్ (Online) ద్వారా నమోదు చేయాల్సిన కీలక సమయంలో ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు వార్డుల్లో ప్రజలు తమ పేర్ల నమోదు కోసం వార్డు అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూసినా వారు అందుబాటులోకి రాకపోవడంతో నిరాశకు గురయ్యారు.
మధ్యాహ్న సమయంలో మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్ హర్ష చౌదరికి ఉద్యోగుల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కార్యాలయంలో అటెండర్‌తో పాటు ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈ వ్యవహారంపై కమిషనర్ తిరుపతిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. సబ్ కలెక్టర్‌ను వివరణ కోరగా స్పష్టమైన సమాధానం రాలేదు. ప్రజా సేవలను (Public Services) పక్కనపెట్టి విందు వినోదాలకు ప్రాధాన్యమిచ్చిన అధికారుల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!