కార్తీక దీపోత్సవంలో ఆధ్యాత్మిక శోభ
భక్తులకు పసుపు, కుంకుమ, ప్రసాద వితరణ
శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామపంచాయతీ పరిధిలోని చాకరిమెట్ల శ్రీ స్వయంభూ సహకార ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక దీపోత్సవ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తిప్రపత్తులతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. దీపోత్సవ వేడుకలతో ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. దీపోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు శాస్త్రుల దేవదత్తు శర్మ, రాజ ప్రభు శర్మ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, తాంబూలం, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు తీర్థప్రసాదాలు అందజేయడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న విశిష్టతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించింది. ఆలయానికి విచ్చేసిన భక్తుల హరిద్వనాలు, స్వామివారి నామస్మరణతో దేవస్థానం మార్మోగింది. కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిపూర్వక వాతావరణంలో ముగిసింది.