మా ప్రాంతానికి మెట్ట పంటలు అనుకూలం కావు
వరి సాగుకు సహకరించాలి...
వరి వద్దు... మెట్ట పంటలే వేయాలంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం...
నిజాంసాగర్‌లో 9 టీఎంసీల నీటి కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలి...
వర్ని రైతు వేదికలో రైతుల డిమాండ్...
బాన్సువాడ,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం పేరుతో వరి సాగు వద్దని, మెట్ట పంటలు మాత్రమే సాగు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూచించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంత భౌగోళిక పరిస్థితులు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా లేవని, వరి పంటపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రభుత్వం వరి సాగుకు సహకరించాలని నిజామాబాద్ జిల్లా వర్ని, చందూర్, మోస్రా మండలాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు.
గురువారం వర్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మెట్ట పంటల సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, తమ ప్రాంతంలో మాత్రం మెట్ట పంటలు సాగు చేయడం సాధ్యం కాదన్నారు. భూములు, నీటి వనరులు, సాగు పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే విధమైన సూచనలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని వరి సాగుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కోరారు.రైతుల సాగు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, వరి సాగుకు నీరు, విద్యుత్, ఎరువుల విషయంలో భరోసా కల్పించాలని వర్ని, చందూర్, మోస్రా మండలాల రైతులు డిమాండ్ చేశారు.
9 టీఎంసీల నీటిపై లెక్క చెప్పాలి!
నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు చెబుతున్న 9 టీఎంసీల నీటిలో తాగునీటి అవసరాలకు ఎన్ని టీఎంసీలు వినియోగిస్తారు? వ్యవసాయానికి ఎన్ని టీఎంసీలు కేటాయిస్తారు? అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, సాగునీటి కేటాయింపులపై అధికారిక ప్రకటన విడుదల చేయాలని కోరారు.
విద్యుత్, ఎరువుల పంపిణీపైనా స్పష్టత కావాలి!
రైతులకు సాగు కోసం రోజుకు ఎన్ని గంటల విద్యుత్ సరఫరా చేస్తారో ప్రభుత్వం ముందుగానే ప్రకటించాలని కోరారు. ఎరువుల పంపిణీ విషయంలో యాప్‌ల విధానంతో రైతులు ఇబ్బందులు పడకుండా పట్టాదారు పాస్‌బుక్కులు, ఆధార్ కార్డుల ఆధారంగా ఎరువులు అందించాలని విజ్ఞప్తి చేశారు.