నీటి శాఖకు తలనొప్పి‘లా’!

16-11-2026 | 05:25am

ఇరిగేషన్ శాఖకు కోర్టు కేసులతో ఇక్కట్లు

  1. ఒకవైపు ప్రాజెక్టులకు అనుమతులు, మరోవైపు వివాదాలు
  2. ఇప్పుడు న్యాయశాఖతో సమన్వయలోపం కోర్టుల్లో ప్రభుత్వ వాదనలకు ఎదురవుతున్న చిక్కులు
  3. కౌంటర్ల దాఖలులో జాప్యంపై అధికారుల్లో అసంతృప్తి న్యాయశాఖ తీరుపై నీటిపారుదల శాఖ మంత్రి ఆగ్రహం
  4. సీఎంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం

నవంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ నీటిపారుదల శాఖను(Telangana Irrigation Department) సమస్యలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల(Irrigation projects) నిర్మాణం, అనుమతులు, అంతర్రాష్ట్ర జలవివాదాలు ఇప్పటికే ప్రభుత్వానికి సవాల్‌గా మారగా ఇప్పుడు కొత్తగా న్యాయపరమైన చిక్కులు తలనొప్పిగా మారుతున్నాయి.

ప్రాజెక్టులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసుల్లో సకాలంలో సమాధానాలు సమర్పించకపోవడం, అవసరమైన సాంకేతిక వివరాలు అందించడంలో జాప్యం కారణంగా ఇరిగేషన్, న్యాయశాఖల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సాధారణంగా భారీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సాంకేతిక అంశాలతోపాటు న్యాయపరమైన వ్యవహారాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.

ప్రాజెక్టుల నిర్మాణం, పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు వంటి అంశాలపై కోర్టుల్లో వివాదాలు కొనసాగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ వాదనను సమర్థంగా వినిపించాలంటే సంబంధిత శాఖ నుంచి కచ్చితమైన సాంకేతిక సమాచారం, ఆధారాలు, నివేదికలు సమయానికి న్యాయశాఖకు చేరాలి.

కానీ ఈ ప్రక్రియలోనే జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రాజెక్టులపై ఇప్పటికే ఉన్న సమస్యలకు న్యాయపరమైన అంశాలు అదనపు భారంగా మారుతున్నాయి. కోర్టు కేసుల్లో ఎదురవుతున్న ఇబ్బందులకు బాధ్యత ఎవరిదన్న అంశం ఇప్పుడు రెండు శాఖల మధ్య చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.

ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్టులకు సంబంధించిన వాస్తవాలు, సాంకేతిక వివరాలు, నివేదికలను అందిస్తున్నప్పటికీ న్యాయపరమైన వాదనల్లో వాటికి భిన్నమైన అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో అడ్వకేట్ జనరల్ కార్యాలయం

వ్యవహరిస్తున్న తీరుపై ఇరిగేషన్ శాఖ వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కోర్టుకు అవసరమైన సమాచారాన్ని సమయానికి అందించకపోతే న్యాయశాఖ సమర్థంగా వాదనలు వినిపించడం కూడా కష్టమే.

ఈ నేపథ్యంలో సమాచారం అందించడంలో ఇరిగేషన్ శాఖ జాప్యం చేస్తోందా? అందిన సమాచారాన్ని న్యాయపరమైన వాదనల్లో సమర్థంగా వినియోగించడంలో న్యాయశాఖ విఫలమవుతోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ రెండు అంశాల మధ్య సమన్వయం లేకపోవడమే అసలు సమస్యగా కనిపిస్తోంది.

కేసుల జాప్యం ప్రాజెక్టులపై ప్రభావం..

ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వ వైఖరి బలంగా ఉండాలంటే ముందస్తు న్యాయపరమైన సన్నద్ధత ఎంతో అవసరం. కౌంటర్ అఫిడవిట్లు, సాంకేతిక నివేదికలు, నిపుణుల అభిప్రాయాలు, శాఖాపరమైన వివరణలు విచారణకు ముందే సిద్ధంగా ఉండాలి. కానీ చివరి నిమిషంలో సమాచారం సేకరించడం, ఒక శాఖ నుంచి మరో శాఖకు ఫైళ్లు వెళ్లడం, బాధ్యతల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ప్రభుత్వ వాదన బలహీనపడే అవకాశం ఉంటుంది.

కోర్టు విచారణ వాయిదాలు, ప్రతికూల ఆదేశాలు లేదా ప్రాజెక్టులపై తాత్కాలిక ఆంక్షలు ఏర్పడితే వాటి ప్రభావం నిర్మాణ పనులు, అనుమతులు, నిధుల వినియోగంపై పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యవహారాన్ని సాధారణ శాఖాపరమైన సమన్వయ సమస్యగా చూడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కేసుల పురోగతిని నిరంతరం సమీక్షించడం, విచారణ తేదీలకు ముందే అవసరమైన పత్రాలు, సాంకేతిక ఆధారాలు, శాఖాపరమైన వివరణలను సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు కనిపించడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మంత్రి అసంతృప్తి.. సీఎంకు ఫిర్యాదు?

న్యాయపరమైన వ్యవహారాల్లో జరుగుతున్న జాప్యం, అధికారుల పనితీరు, రెండు శాఖల మధ్య సమన్వయ లోపంపై ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై మంత్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరిగేషన్, న్యాయశాఖల మధ్య నెలకొన్న విభేదాలు ప్రభుత్వ స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణకు కీలకమైన సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు అనేక అంశాలపై ఆధారపడి ఉంది. జలవివాదాలు, కేంద్ర అనుమతులు, ఆర్థిక వనరులతోపాటు కోర్టు కేసులు కూడా ప్రాజెక్టుల పురోగతిని ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వంలోని రెండు కీలక శాఖల మధ్యే సమన్వయం లేకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఒక శాఖ ఇచ్చిన సమాచారం మరో శాఖకు సరిగ్గా చేరకపోవడం, బాధ్యతలపై స్పష్టత లేకపోవడం చివరకు ప్రభుత్వానికే న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించవచ్చు. ఇప్పటికైనా ప్రాజెక్టుల వారీగా పెండింగ్ కేసుల జాబితా రూపొందించి, ప్రతి కేసుకు ప్రత్యేక అధికారిని బాధ్యుడిగా నియమించడంతోపాటు ఇరిగేషన్, న్యాయశాఖ, అడ్వకేట్ జనరల్ కార్యాలయం మధ్య నిరంతర సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

లేకపోతే ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో శాఖల మధ్య అంతర్గత విభేదాలే మరో అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. అసలు సమస్య ఎక్కడుంది? జవాబుల జాప్యానికి బాధ్యులెవరు? రెండు శాఖల మధ్య సమన్వయాన్ని ప్రభుత్వం ఎలా పునరుద్ధరిస్తుంది? అనే అంశాలు కీలక సవాల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వం దృష్టి సారించి సమన్వయంతో చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు