న్యూయార్క్‌కు మళ్లీ నాన్‌స్టాప్ ఫ్లైట్స్!

15-11-2026 | 08:46pm

న్యూఢిల్లీ: భారత్ నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా(Air India) కీలక ఊరటనిచ్చింది. ఢిల్లీ, ముంబై నుంచి న్యూయార్క్‌కు నాన్‌స్టాప్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. దీంతో గతంలో ఎదురైన సుదీర్ఘ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రయాణికులకు దాదాపు ఐదు గంటల సమయం ఆదా కానుంది.

గతంలో పశ్చిమాసియాలో నెలకొన్న గగనతల ఆంక్షల కారణంగా ఎయిర్ ఇండియా విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించేవి. ఇంధనం నింపుకోవడం కోసం ఇటలీలోని రోమ్‌లో సాంకేతిక విరామం కూడా తీసుకునేవి. దీంతో భారత్ నుంచి న్యూయార్క్ చేరుకోవడానికి సుమారు 22 గంటలు పట్టేది. తాజాగా ఇరాక్ గగనతలం అందుబాటులోకి రావడంతో ప్రయాణ మార్గంలో మార్పులు చేసి, ప్రయాణ సమయాన్ని సుమారు 17 గంటలకు తగ్గించింది.

విమాన సర్వీసుల వివరాలు ఇవే:

ఢిల్లీ నుంచి న్యూయార్క్ (JFK)కు ప్రతిరోజూ ఒక విమానం.

ముంబై నుంచి న్యూయార్క్ (JFK)కు ప్రతిరోజూ ఒక విమానం.

ఢిల్లీ నుంచి నెవార్క్ (EWR)కు వారానికి నాలుగు విమానాలు.

ముంబై నుంచి నెవార్క్ (EWR)కు వారానికి మూడు విమానాలు.

అధునాతన విమానాల్లో ప్రయాణ సౌకర్యాలు

ఈ మార్గాల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను వినియోగిస్తోంది. ఢిల్లీ నుంచి నడిచే సర్వీసులకు ఎయిర్‌బస్ A350-900 విమానాలను ఉపయోగిస్తోంది. వీటిలో 28 బిజినెస్ సూట్లు, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, 264 ఎకానమీ సీట్లు ఉన్నాయి. ముంబై నుంచి నడిచే సర్వీసుల్లో బోయింగ్ 777-300ER విమానాలను వినియోగిస్తోంది. వీటిలో 8 ఫస్ట్ క్లాస్ సూట్లు, 40 బిజినెస్ క్లాస్ సీట్లు, 280 ఎకానమీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

గగనతల ఆంక్షల కారణంగా ఏర్పడిన ప్రయాణ ఇబ్బందులు తగ్గడంతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా తరచూ అమెరికాకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ మార్పు ఉపయోగకరంగా ఉండనుంది.

మరిన్ని వార్తలు