మరో మూడు రోజులు చలి తీవ్రత!
నవంబర్ 19 తర్వాత తగ్గనున్న చలి ప్రభావం
20 నుంచి 22 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
బోధన్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రానున్న మూడు రాత్రులు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్(Telangana Weatherman) వెల్లడించారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నవంబర్ 19 తర్వాత తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
వాతావరణ పరిస్థితుల మార్పుల నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 22వ తేదీ వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ నవంబర్ 20 నుంచి 22 మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు, గాలుల పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత, ఆ తర్వాత తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ హెచ్చరికలు సూచిస్తున్నాయి.