ప్రజాస్వామ్యాన్ని కాలరాసింది కాంగ్రెస్సే

16-11-2026 | 05:20am
  1. ఓట్ చోర్, సంవిధాన్ చోర్ కా పార్టీ
  2. భారత్ సమ్మిట్ పేరుతో దేశ ప్రతిష్ఠకు భంగం 
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
  4. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చురుకుగా పనిచేయాలి
  5. పార్టీ శ్రేణులకు పిలుపు

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, భారత్ సమ్మిట్(India Summit) పేరుతో జార్జ్ సోరోస్ నిధులతో(George Soros funds) నడిచే దేశ వ్యతిరేక శక్తులను హైదరాబాద్‌కు రప్పించి భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు(BJP State President N. Ramchander Rao) పేర్కొన్నారు. అసలు దేశంలో ‘ఓట్ చోర్’, సంవిధాన్ చోర్’ కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు.

భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తే సహించేది లేదు. రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీకి చెందిన అన్ని విభాగాల (ఆల్ సెల్స్)తో సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.

పార్టీ నిర్మాణంలో అన్ని విభాగాలు అత్యంత కీలకమైనవని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సెల్స్ పనితీరుకు ఎంతో ప్రాధాన్యతనిస్తారని తెలిపారు. జాతీయ స్థాయిలో పార్టీకి 22 అధికారిక సెల్స్ ఉన్నాయని, రాష్ట్ర స్థాయిలో అవసరాన్ని బట్టి మరో ఐదారు సెల్స్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

ఎక్స్-సర్వీస్‌మెన్, అడ్వకేట్స్, ట్రేడర్స్, ఐటీ, సోషల్ మీడియా, టీచర్స్, ఎడ్యుకేషన్, డాక్టర్స్, కల్చరల్ సెల్ వంటి విభాగాల ద్వారా సమాజంలోని వివిధ వృత్తి నిపుణులను, మేధావులను పార్టీతో అనుసంధానించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో ఇతర ఆఫీస్ బేరర్స్‌కు ఉన్నంత ప్రాముఖ్యత సెల్స్ కన్వీనర్లకు కూడా ఉంటుందని, తాను కూడా గతంలో లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా పనిచేశానని గుర్తు చేశారు.

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ సూచనల మేరకు ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘సికిందర్’ సినిమాలోని డాల్ డాల్ పర్ సోనే కి చిడియా గీతం స్ఫూర్తితో ప్రజల్లో జాతీయవాద చైతన్యం నింపాలని పార్టీ కల్చరల్ సెల్‌కు సూచించారు.  

విదేశీయులతో దేశానికి వ్యతిరేకంగా...

హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన భారత్ సమ్మిట్‌పై రాంచందర్ రావు విమర్శలు గుప్పించారు. పెట్టుబడుల సదస్సు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గిగ్ వర్కర్లు ఎవరూ కనిపించలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలనే తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. భారత అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టారు.

ఇటలీ నుంచి వచ్చిన ఒక ప్రతినిధి ఓట్ చోర్, గద్దీ చోర్ అంటూ వ్యాఖ్యలు చేయడం మన దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. అమెరికా వంటి దేశాల్లో విదేశీయులు అక్కడి అంతర్గత రాజకీయాలపై మాట్లాడితే ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరని వెల్లడించారు. అలాంటిది రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని ‘డెడ్ ఎకానమీ’ అని అవమానించడం, ఇప్పుడు విదేశీయులను పిలిపించి మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడించడం దేశద్రోహ చర్యేనని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సుకు 350 మంది విదేశీ ప్రతినిధులు రావాల్సి ఉండగా, కేవలం 115 మంది మాత్రమే హాజరయ్యారని, భారత వ్యతిరేక వ్యాసాలు రాసిన నార్వే జర్నలిస్టు హెల్లెలింగ్ సహా మిగిలిన వారికి కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో వీసాలు రద్దు చేయడం ముమ్మాటికీ సరైన నిర్ణయమని ఆయన సమర్థించారు. 

ప్రభుత్వాలను కూల్చేస్తామని ప్రకటించేవారితో..

ప్రపంచవ్యాప్తంగా జాతీయవాద ప్రభుత్వాలను కూల్చివేస్తానని బహిరంగంగా ప్రకటించిన జార్జ్ సోరోస్ నిధులతో నడిచే ‘ప్రోగ్రెసివ్ అలయన్స్’, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్’ సంస్థల ప్రతినిధులను ఈ సమ్మిట్‌కు రప్పించారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలను ప్రేరేపించి ప్రభుత్వాలను కూల్చేసే కుట్రలతో వీరు భారతదేశంలో అశాంతి సృష్టించాలని చూస్తున్నారని హెచ్చరించారు.

2014 తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను రాంచందర్ రావు తిప్పికొట్టారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అత్యధిక మద్దతు ఉన్నప్పటికీ జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడం మొదటి ఓటు చోరీ అని పేర్కొన్నారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశంపై భారత్ వాణిని వినిపించడానికి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని పంపారని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ,

మన్మోహన్ సింగ్ ఏనాడూ విదేశాల్లో దేశ ప్రతిష్ఠను తగ్గించేలా మాట్లాడలేదని గుర్తు చేశారు. భారత గడ్డపైకి దేశ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చి మన ప్రజాస్వామ్యాన్ని అవమానించినందుకు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఈ సమ్మిట్లో పాల్గొని దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరిపై బీజేపీ తెలంగాణ తరపున తగిన వేదికలపై ఫిర్యాదు చేస్తామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.


మరిన్ని వార్తలు