మిల్లర్ల సహాయ నిరాకరణ!

16-11-2026 | 05:20am
  1. 2026 సీజన్‌లో ధాన్యం తీసుకోవడానికి దూరం
  2. అంతర్గతంగా అధికారులు సూచించినా.. స్పందన శూన్యం
  3. ఈసారి వడ్ల మిల్లింగ్‌పై కమ్ముకుంటున్న నీలినీడలు

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): రైస్ మిల్లర్లు(Rice Millers) మెల్లమెల్లగా సహాయనిరాకరణలోకి వెళ్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారులు అంతర్గతంగా ఎంపిక చేసిన మిల్లర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చినప్పటికీ.. తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే మిల్లర్లు ఈ సహాయ నిరాకరణకు పూనుకున్నట్టు  తెలుస్తున్నది.

ఫలితంగా ఈ సీజన్‌లో ధాన్యం మిల్లింగ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రతిగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది తేలాల్సి ఉంది.

సర్కారు వర్సెస్ మిల్లర్లు

అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన బియ్యం బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూకుడుగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నదో.. అదేస్థాయిలో తమ సమస్యలను, ఇబ్బందులను కూడా పరిష్కరించాలని రైస్ మిల్లర్లు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా రైస్ మిల్లర్ల అసోసియేషన్లు, అలాగే రాష్ట్రస్థాయిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా తమ కష్టాలను, నష్టాలను పట్టించుకోవాలంటూ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తులు చేస్తూనే.. అప్పటి వరకు సర్కారుకు సహాయ నిరాకరణకు దిగుతున్నాయి.

దీనితో పలు జిల్లాల్లో ఇప్పటికే తమకు ఈ సీజన్‌లో ధాన్యం కేటాయించొద్దని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. రైస్ మిల్లర్లు ఈసారి మిల్లింగ్ చేయకుండా.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తద్వారా తమ సమస్యలను, కష్టాలను, నష్టాలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుండగా.. ప్రభుత్వం కూడా అదే స్థాయి పట్టుదలతో ముందుకు సాగుతున్నది.

తనిఖీలు, కేసులు, మిల్లర్ల అక్రమాలు, అవకతవకలను బయటకు తీస్తూ.. అరెస్టు చేస్తూ.. అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని మిల్లర్లకు తెలిసొచ్చేలా అడుగులు వేస్తున్నది. ఇలా సర్కార్ వర్సెస్ మిల్లర్లుగా సాగుతున్న ప్రస్తుత వ్యవహారంలో సర్కారుకు మరో శరాఘాతం తగిలిందనే చెప్పొచ్చు.

మిల్లర్ల అక్రమాలు, అవకతవకలు, అవినీతికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు తాజా సీజన్ (2026 కొత్తగా పెట్టిన నిబంధనల ప్రకారం మిల్లర్లు ముందుకు వచ్చి తమ అంగీకారం తెలుపుతారని అధికారగణం భావించింది. అయితే మిల్లర్ల నుంచి మొండిచేయి కనపడటంతో.. అధికారయంత్రాంగం ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఉత్కంఠ వ్యక్తమవుతున్నది. 

అంతర్గతంగా ధాన్యం కేటాయింపులు..

2026 సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒకింత మంచి రికార్డు ఉన్న మిల్లర్లకు కేటాయించి సీఎంఆర్ తీసుకోవాలని అధికార యంత్రాంగం భావించింది. అందుకు తగ్గట్టుగానే జిల్లాల వారీగా ఒక్కో మిల్లరు చరిత్రను పరిశీలించి, మిల్లింగ్ సామర్థ్యాన్ని అనుసరించి ఎంత ధాన్యం కేటాయిస్తున్నారు.. ఎంత బీజీ (బ్యాంక్ గ్యారంటీ) చెల్లించాలి..

అనేది అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ స్థాయి నుంచే ఆయా మిల్లర్లతో ధాన్యం మిల్లింగ్‌కు ఒప్పుకోవాలనేలా అంతర్గతంగా కౌన్సెలింగ్ ఇప్పించారు. జాబితాలను సిద్ధంచేసి.. పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ సమన్వయంతో ఆయా మిల్లర్లతో మాట్లాడి మౌఖికంగా ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే శనివారం సాయంత్రం 3 గంటలకల్లా ఈ ఒప్పందాలు పూర్తి కావాల్సి ఉంది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మిల్లరు ముందుకు రాలేదు.  

ఆశ నిరాశల మధ్యన మిల్లింగ్..!

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది టన్నుల ధాన్యం మిల్లింగ్ ఎలా అనే సమస్య ఇప్పుడు అధికారుల్లో ఆందోళనకు కారణమవుతున్నది. శనివారం సాయంత్రం వరకు తాము ఎంపిక చేసిన మిల్లర్లందరూ ఒప్పుకుని 10 శాతం బ్యాంక్ గ్యారంటీతో ముందుకు వస్తారని అధికారులు భావించారు. అయితే తమ సమస్యలను కూడా పట్టించుకుని.

తమ కష్టాలు, నష్టాలను తీర్చేలా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో మిల్లర్లు సహాయ నిరాకరణకు దిగుతున్నట్టుగా అధికారులకు కూడా అర్థమైంది. శనివారం గడువు ముగియడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్ (2026 ఖరీఫ్, రబీలో మిల్లింగ్ సాధ్యమవుతుందా అనేది ఆశ నిరాశల మధ్యన ఊగసలాడుతున్నది.

ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 42 రైస్ మిల్లులకు సుమారు 1.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. శనివారం నాటికి ఒక్క మిల్లరు కూడా మిల్లింగ్ చేసేందుకు తాజా నిబంధనల ప్రకారం ముందుకు రాకపోవడంతో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నిర్ణయించిన వందలాది మిల్లుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. లక్షలాది టన్నుల ధాన్యం మిల్లింగ్ ఎలా అనే సమస్య మొదలైంది. 

మరిన్ని వార్తలు