నా కెరీర్‌లోనే స్పెషల్ మూవీ

16-11-2026 | 06:33am

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) తన తాజా చిత్రం 'ఆకాశంలో ఒక తార'పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌లోనే ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉంటుందని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశాడు.

ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. 'సీతారామం' తర్వాత ఈ కథ విన్నప్పుడే చాలా స్పెషల్‌గా అనిపించిందని చెప్పాడు. తన కెరీర్‌లో లాంగ్ టైమ్ గుర్తుండిపోయే చిత్రంగా ఇది నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే అల్లు అర్జున్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. తన ఫస్ట్ మూవీ షూటింగ్ కేరళలోని ఓ గ్రామంలో జరిగినప్పుడు, తాను బస చేసిన ఇంట్లో బన్నీ ఫొటో ఉండేదని తెలిపాడు. అప్పటికే ఆయన అక్కడ పెద్ద స్టార్ అని, ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదగడం సంతోషంగా ఉందన్నాడు.

అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో'(Ala Vaikunthapurramuloo) తన ఫేవరెట్ సినిమాల్లో ఒకటని దుల్కర్ వెల్లడించాడు. కరోనా సమయంలో ఫ్యామిలీతో కలిసి ఆ మూవీని చాలాసార్లు చూశానని, తన కుమార్తె కూడా బన్నీకి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. ఈ కామెంట్స్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు పవన్ సాధినేనికి కథపై ఉన్న క్లారిటీ, కాన్ఫిడెన్స్ తనను ఆకట్టుకున్నాయని ప్రశంసించాడు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కథ విన్న వెంటనే ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పడం తనలో మరింత నమ్మకాన్ని పెంచిందన్నాడు.

నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) డెడికేషన్, ఎనర్జీ అద్భుతమని దుల్కర్ కొనియాడాడు. హీరోయిన్ సాత్వికతో పాటు కీలక పాత్రల్లో నటించిన శ్రుతి హాసన్, రుహానీ శర్మ పెర్ఫార్మెన్స్‌ను అభినందించాడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్లపై తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. మరి దుల్కర్ చెబుతున్నట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి!

మరిన్ని వార్తలు