విధినిర్వహణలో నిర్లక్ష్యం!?

16-11-2026 | 05:10am
  1. డుమ్మాలు కొడుతూ సొంత పనుల్లో బిజీ 
  2. పిట్లం ప్రభుత్వాసుపత్రి ఎమ్మెల్యే తనిఖీల్లో బట్ట బయలు 
  3. ప్రభుత్వ వైద్యులు మారేది ఎప్పుడు..?

కామారెడ్డి, నవంబర్ 15 (విజయక్రాంతి): పేద ప్రజలకు వైద్య సేవలు(Medical Services) అందిస్తామని పట్టా పుచ్చుకున్న సమయంలో వైద్యులు చేసే ప్రతిజ్ఞ ఇది. ప్రభుత్వ వైద్యునిగా(Government doctor) విధుల్లో చేరినప్పుడు పేదలకు వైద్యం అందిస్తామని చెప్పే మాటలు ఇవి. ఆచరణలో చూస్తే వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చిన ట్లుగా కనబడుతుంది.

ఇటీవల కామారెడ్డి జి ల్లా పిట్లం ప్రభుత్వాసుపత్రిని స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యులు ఒకరోజు ముందుగానే సెలవు పెట్టకుండా హాజ రు వేసుకున్న ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన చూస్తే వైద్యులు ఎంత మేరకు మారుమూల మండలాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు ఇట్టే అర్థమవుతుంది.

విధుల్లో నిర్లక్ష్యం...

మారుమూల మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో సైతం కొంతమంది ప్రభుత్వ వైద్యులు సొంత వైద్యానికి అలవాటు పడి విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లక్షల రూపాయల ప్రభుత్వ దనాన్ని వేతనాలుగా పొందుతున్న కొందరు వైద్యులు వారు అందిస్తున్న సేవలు అగమ్య గోచరంగా ఉన్నాయి. మొక్కుబడిగా వచ్చి సంతకాలు పెట్టి మమ అనిపిస్తున్నారు. లక్షలాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని గుల్ల చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు కొందరు మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

పేదలకు వైద్యం అందని ద్రాక్ష 

ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పేద ప్రజలకు వైద్యం మాత్రం అందనంత దూరం లోనే ఉంది. మారుమూల మండలాల్లో ఉన్న ఆసుపత్రుల్లో పనిచేసే కొంతమంది వైద్యులు కష్టాన్ని కోర్చి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారికి కొందరు మచ్చ తెచ్చి పెడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, సమయానికి రాకపోవడం, డుమ్మాలు కొట్టడం, రాకున్నా హాజరు వేసుకోవడం వంటి చర్యలకు ప్రభుత్వ వైద్యులు కొందరు చేపట్టడం అపహాస్యంగా మారింది.

స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన నియోజకవర్గం లోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ వైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు వైద్యుల విధుల నిర్లక్ష్యం చూసి ఆశ్చర్య పోతున్నారు. మారుమూల మండల పేద ప్రజలకు సర్కారు వైద్యం పేపర్లకే పరిమితమవుతుందని ఎమ్మెల్యే విస్మయం వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వ వైద్యులు ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నా రో అర్థం చేసుకోవచ్చు. 

జిల్లా వైద్య సంఘం తీరుపై కొనసాగుతున్న చర్చ

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి జిల్లా వైద్యుల సంఘం ఎమ్మెల్యే పై ఆరోపణలు చేయడం అర్థరహితం అని ప్రజలు విమర్శిస్తున్నారు.

విధులు సక్రమంగా నిర్వహించకుండా విధులకు హాజరుకాకుండానే రిజిస్టర్లో వైద్యులు హాజరు వేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్న వైద్యులపై మాట్లాడకుండా ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే పై జిల్లా వైద్య సంఘం ఆరోపణలకు పాల్పడడం చూస్తుంటే నిర్లక్ష్యం చేసే వారికి జిల్లా వైద్య సంఘం బాసట నిలవడం పై జిల్లాలో చర్చ కొనసాగుతుంది.

పేద ప్రజలకు వైద్యం అందిస్తామని ఉద్యోగంలో చేరిన వైద్యులు విధులు నిర్లక్ష్యం చేస్తున్న వారిని క్రమ పద్ధతిలోకి తీసుకురావాల్సిన జిల్లా వైద్య సంఘం ప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్న వారికి కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రజా ప్రతినిధి గా ఆకస్మికంగా వైద్యశాలను తనిఖీ చేస్తే తప్పు పట్టడం జిల్లా వైద్యశాఖ సంఘం పనితీరు పై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

పేద ప్రజలకు వైద్యం అందిస్తామని ప్రభుత్వ ధనాన్ని పొందుతున్న వైద్యులు సేవలందించాల్సింది పోయి మొక్కుబడి సేవలందిస్తూ సొంత దావకానాలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రైవేట్ ఆసుపత్రికి పంపుతున్న వైద్యులు సైతం జిల్లాలో ఉన్నారు. ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్న వైద్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం వారికి వంత పాడడం వల్లనే ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ సైతం గతంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు కూడా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. పలువురు సిబ్బందిని సస్పెండ్ సైతం చేశారు. 

మారుమూల ప్రాంతాలలో వైద్యుల తీరు మారని వైనం

అయినా మార్మూలా మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారడం లేదు. అందులో పని చేసే వైద్యులు, అధికారుల తీరు మారడం లేదు. నిజాయితీగా పనిచేసే వైద్యులకు మద్దతిచ్చి, డుమ్మాలు కొట్టే, వైద్యు లు తీరు ఇకనైనా మార్చాల్సిన అవసరం ఉంది, లేకుంటే ప్రజలే చైతన్యవంతమై అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న,

విధులు నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై చర్యలకు సైతం వెనుకాడే పరిస్థితి కనపడడం లేదు. కామారెడ్డి జిల్లాలో త్వరలోనే ప్రజలు ప్రభుత్వ వైద్యుల పనితీరును ఎండగట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు సైతం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోకుండా విధులు నిర్లక్ష్యం చేసే వైద్యుల ను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి వంత పాడడం సరికాదు అంటున్నారు.

కింది స్థాయి సిబ్బంది పైనే పని భారం

మారుమూల మండల కేంద్రాల్లోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న  వైద్యులు కొందరు వీధులకు డుమ్మాలు కొడుతూ కిందిస్థాయి సిబ్బందిపై పని భారం మోపుతున్నారు. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పలేక వారు చెప్పిందే వేధంగా పనిచేస్తున్నారు. సెలవులు పొందడం లేదు పని భారం తప్పడం లేదు. లో లోపల కిందిస్థాయి సిబ్బంది మదన పడుతున్నారు. ఉన్నతాధికారులు చర్యలకు పూనుకుంటేనే ఇలాంటి  వైద్యుల నిర్లక్ష్యం తగ్గుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే సహించం 

జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. విధుల్లో నిర్లక్ష్యం చేసే వైద్యులపై సిబ్బందిపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. విధులకు డుమ్మాలు కొట్టే వైద్యులను వదిలి పెట్టం. అవినీతి, అక్రమాలకు వైద్యశాఖలో తావు లేకుండా చూస్తా. జిల్లా ప్రజలు సహకరించాలి. వైద్యుల తో ప్రత్యేక సమావేశాలు పెట్టి హెచ్చరిస్తాం.

 డాక్టర్ వెంకట్, జిల్లా వైద్యశాఖ అధికారి, కామారెడ్డి 


మరిన్ని వార్తలు