వ్యవసాయ మార్కెట్లో వరద!?
- కొనసాగుతున్న డ్రైనేజీ పనులు
- ఎక్కడి నీరు అక్కడే నిలువ
- ఇబ్బందులు పడుతున్న రైతులు
కేసముద్రం, నవంబర్ 2 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీలో(Kesamudram Municipality) డ్రైనేజీ నిర్మాణం(Drainage Works) పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్(R&B Guest House) వరకు రోడ్ల విస్తరణ తో పాటు డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే రోడ్ల విస్తరణకు, డ్రైనేజీ నిర్మాణానికి పలుచోట్ల ఇండ్లు, వాణిజ్య సముదాయాలు అడ్డుగా మారాయి.
అవసరమైన మేర నిర్మాణాలను తొలగించకపోవడం వల్ల డ్రైనేజీ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణం పనులు పక్కనపెట్టి, రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీనితో అనేకచోట్ల రోడ్లు గతంతో పోలిస్తే ఎక్కువ ఎత్తు పెంచారు. గతంలో ఉన్న డ్రైనేజీ కాలువలను పూర్తిగా తొలగించారు. కొత్తగా కాలువలు నిర్మించకపోవడం, రోడ్డు ఎత్తు పెరగడంతో మురుగునీరుతో పాటు వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డు రహదారులు వరద నీటితో నిండి చెరువులను తలపించాయి.
అలాగే పలుచోట్ల వరద నీరు ముందుకు వెళ్లకుండా ఇండ్లలోని సెల్లార్లలో తిష్ట వేసింది. ఫలితంగా ప్రజలకు, రైతులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి వరద నీరు, మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
బ్యాంక్‌లోకి వెళ్లడానికి ఆటంకం..
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయంలోకి వెళ్లడానికి ఆటంకంగా మారింది. గేటు వద్ద నీరు నిలుస్తుండడంతో గేటు మూయడం వల్ల, చుట్టూ తిరిగి మరో గేటు ద్వారా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మార్కెట్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రం వాహనం కూడా బయటకు రావడానికి ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మించి రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
షాపుల నిర్వాహణకు ఇబ్బంది
కాల్వల నిర్మాణం చేపట్టకుండా రోడ్డు వేసి డివైడర్ నిర్మించి వదిలేశారు. మురుగు నీరు, వరద నీరు షాపుల ముందే ఉండడం వల్ల పనులు చేయడానికి ఆటంకంగా మారింది. మార్కింగ్ ఇచ్చి కొన్ని చోట్ల షాపులను తొలగించారు. అయినా కూడా డ్రైనేజీ నిర్మించడం లేదు. దీనితో రోజువారి పనులు చేసుకునే వారికి ఉపాధి లేకుండా పోతోంది. వెంటనే మార్కెట్ రోడ్ లో డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలి.
- మారగాని శ్రీధర్,
ఇంజనీరింగ్ షాప్ యజమాని