అస్తవ్యస్తం 2వ ఫ్లాట్ ఫామ్..!

30-10-2026 | 05:10am

నత్త నడకన సాగుతున్న పనులు

రైలు ప్రయాణికులకు ఇబ్బందులు

మహబూబాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రైల్వే శాఖ పనులంటే పటిష్టత, నాణ్యతతో నిర్ణీత సమయంలో చేస్తారనే అభిప్రాయం ఉండేది. అయితే ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్(Kesamudram Railway Station) 2వ నంబర్ ఫ్లాట్ ఫామ్ పై చేపట్టిన అభివృద్ధి పనులు నత్త నడకన సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం రెండవ నంబర్ ఫ్లాట్ పై తాగునీరు సరఫరా, ప్రయాణికుల ననిరీక్షణకు సౌకర్యాల కల్పన కోసం పనులు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు పనులను పూర్తి చేయకుండా వదిలేసారనే విమర్శలు వస్తున్నాయి. దీనితో వరంగల్ , సికింద్రాబాద్ వైపు ప్రతి రోజు రైళ్ల కోసం నిరీక్షించే వందల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికులు రైళ్ల కోసం ప్రస్తుతం రెండవ నంబరు ప్లాట్ఫారంపై నిరీక్షించడానికి కనీసం కూర్చోవడానికి సరైన వసతి లేక ఇబ్బందులు పడాల్సిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండవ నంబరు ప్లాట్ఫామ్ పై ప్రయాణికుల నిరీక్షణ కోసం సరిపడా కుర్చీలు లేవని, ఫ్యాన్లు లేవని, నిలువ నీడ కోసం ఉన్న రెండు షెడ్లలో ఒక షెడ్డు పైకప్పు మరమత్తు కోసం ఇటీవల తొలగించారని, దీనివల్ల ప్లాట్ఫామ్ పై ప్రయాణికులకు అసౌకర్యంగా మారిందని చెబుతున్నారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై టాయిలెట్లు, మరుగుదొడ్లు, సాధారణ ప్రయాణికులకు మీకు ఉండే హాల్, రెండు ఫుల్ కవర్ షెడ్లు ఉండగా, ఇదేవిధంగా రెండవ నెంబర్ ప్లాట్ఫారంపై సరైన వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండో నంబర్ ఫ్లాట్ ఫామ్ పై ప్రయాణికులకు టాయిలెట్లు, మరుగుదొడ్లు లేవని, తాగునీరు సరఫరా లేదని, దీంతో ప్రయాణికులు ఒకటవ నంబర్ ఫ్లాట్ ఫామ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. ఫ్లాట్ ఫామ్ పై రాళ్ళ కుప్పలతో ట్రైన్ వచ్చే సమయంలో ప్రమాదాలు చోటు జరుగు తున్నాయని, చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. 

సౌకర్యాలు కల్పించాలి

రెండో నంబర్ ఫ్లాట్ ఫామ్ పై ప్రయాణికులకు మూత్ర శాలలు, మరుగు దొడ్లు, తాగునీటి వసతి, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. ఫ్లాట్ ఫామ్ పై ప్రయాణికులకు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలి. ఒకటో నంబర్ ఫ్లాట్ ఫామ్ పై ఉన్న విధంగా జనరల్ వెయిటింగ్ హాల్ నిర్మించాలి. అమీనాపురం వైపు ప్రత్యేకంగా టికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. కేసముద్రం రైల్వే స్టేషన్లో 1,2,3 ఫ్లాట్ ఫారాలపై కోచ్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. 

-కంది వెంకన్న , ప్రయాణికుడు, కేసముద్రం

మరిన్ని వార్తలు