చెరువులను చెరబడుతున్నారు!
- ఏజెన్సీలో సైతం కనుమరుగవుతున్న చెరువులు.. కుంటలు
- జలవనరులపై అక్రమార్కుల కన్ను
- చెరువు శిఖం భూములకూ ఎసరు!
- మట్టితో పూడ్చి.. ప్లాట్లుగా విభజించి విక్రయాలు?
- కబ్జాల చెరలో జలవనరులు.. చోద్యం చూస్తున్న అధికారులు
మహబూబాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఒకప్పుడు పల్లె ప్రజల దాహార్తిని తీర్చినవి.. పశుపక్ష్యాదులకు(Animal and bird) జీవనాధారంగా నిలిచినవి.. వేలాది ఎకరాల సాగుకు నీరందించినవి.. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను(Groundwater) సుసంపన్నం చేసిన చెరువులు, కుంటలు. అలాంటి అమూల్యమైన జలవనరులు నేడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని ఇండ్ల స్థలాలుగా మారిపోయి కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) అనేక చెరువులు, కుంటలతో పాటు ఏజెన్సీ పరిధిలోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటల ఉనికికే ముప్పు వాటిల్లుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జలవనరులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, వాటి స్థలాలను మట్టితో పూడ్చి నివాస గృహాల ప్లాట్లుగా మార్చుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జలవనరులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, వాటి స్థలాలను మట్టితో పూడ్చి నివాస గృహాల ప్లాట్లుగా మార్చుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జలవనరులే రియల్ ఎస్టేట్ భూములా?
గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కేవలం నీటి నిల్వ కేంద్రాలు మాత్రమే కావు. అవి పర్యావరణ సమతుల్యతకు, జీవవైవిధ్య పరిరక్షణకు, వ్యవసాయ రంగానికి వెన్నెముక వంటివి. వర్షాకాలంలో వరద ఉధృతిని తగ్గిస్తూ, భూగర్భ జలమట్టాన్ని పెంచుతూ వేసవిలోనూ నీటి లభ్యతకు భరోసా కల్పిస్తాయి. జిల్లాలోని ఏజెన్సీ పరిధిలో కొన్ని జలవనరుల భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు శిఖం భూములు, కుంటల పరిధులు, నీటి ప్రవాహ మార్గాలను చదును చేసి ప్లాట్లుగా మార్చుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మట్టి పోస్తే చెరువు మాయమైనట్టేనా?
చెరువులు, కుంటల పరిధిలోకి మట్టిని తరలించి పోయడం, సహజ నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకోవడం, క్రమంగా భూమిని చదును చేసి స్థలాలుగా విభజించడం వంటి చర్యలు జలవనరుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నిన్నటి వరకు నీటితో కళకళలాడిన ప్రాంతాలు రేపు కాంక్రీట్ నిర్మాణాలతో కనిపిస్తే అందుకు బాధ్యత ఎవరిదనే ఆరోపణలు వస్తున్నాయి. చెరువు భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి ప్లాట్లుగా చేసి విక్రయి స్తున్నారనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూముల రికార్డుల్లో చెరువులుగా నమోదైన ప్రాంతాలు, వాస్తవంగా ఆక్రమణలకు గురైన విస్తీర్ణం ఎంత?, ఎవరి ఆధ్వర్యంలో ఈ మార్పులు జరుగుతున్నాయి?, సంబంధిత శాఖలు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి?, అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అధికారుల పర్యవేక్షణ ఏదీ?
మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో మొదలుకొని వివిధ పట్టణాలు గ్రామాలు మండల కేంద్రాలు మారుమూల పల్లెల్లో ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, స్థానిక సంస్థల సంబంధిత అధికారులపై ఉంది. అయినప్పటికీ జలవనరుల పరిధిలో ఆక్రమణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వినిపిస్తుండటం అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణపై విమర్శలు వస్తున్నాయి. భూముల రికార్డులను పరిశీలించి, చెరువు శిఖం, ఎఫ్టీఎల్ పరిధులను గుర్తించి, హద్దులను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అక్రమ మట్టి పూడికలు, అనధికార లేఅవుట్లు, నీటి ప్రవాహానికి అడ్డంకులపై సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
అంతా కుమ్మక్కై మింగేస్తున్నారు
గూడూరు గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాలను అతిక్రమిస్తున్నారు. పార్టీలకతీతంగా కొందరు నేతలు కుమ్మక్కై చెరువులు, కుంటలను మింగేస్తున్నారు. ఏజెన్సీలో గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్న ఘటనలపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ దందా సాగుతున్నా, చెరువు, కుంటలను, ప్రభుత్వ భూముల కబ్జా చేస్తూ ప్లాట్లుగా చేసి అక్రమంగా విక్రయాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
ఈ సంఘటనలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. హైదరాబాద్ ‘ హైడ్రా’ తరహాలో మహబూబాబాద్ జిల్లాలో కూడా అక్రమ దందాలను నిలువరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకు జరిగిన అన్ని కబ్జాలపై విచారణ జరిపి నిర్దాక్షిణ్యంగా వాటిని తొలగించి చెరువులు, కుంటలను పునరుద్ధరించాలి.
- పానుగంటి నరసయ్య, ఎంసీపీఐ, కేంద్ర కమిటీ సభ్యుడు