నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు!
- రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
- రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో తయారీ కేంద్రం
- 500 నోట్లను ముద్రించి చలామణి చేసేందుకు కుట్ర
- యూట్యూబ్ వీడియోలతో నోట్ల తయారీ
- పోలీసులమంటూ నకిలీ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్‌తో బెదిరింపులు
- ఏడుగురు నిందితుల్లో నలుగురు అరెస్ట్.. పరారీలో ముగ్గురు!
- వివరాలు వెల్లడించిన ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 3: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ కరెన్సీ ముద్రణకు(Printing of counterfeit currency) పాల్పడుతున్న ముఠాను ఫ్యూచర్ సిటీ పోలీసులు(Future City Police) గుట్టు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులో రహస్యంగా ఏర్పాటు చేసిన నకిలీ కరెన్సీ తయారీ కేంద్రంపై మంగళవారం పోలీసులు దాడి చేసి, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఏకంగా రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లతో పాటు కరెన్సీ ముద్రణకు ఉపయోగించిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్కానర్లు, లామినేషన్, కటింగ్ యంత్రాలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబం ధించి ఫ్యూచర్ సిటీ కమిషనర్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ‘సోమవారం రాత్రి కుంట్లూరు నుంచి విజయవాడకు నకిలీ కరెన్సీ తరలిస్తున్నారని పక్క సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, మహేశ్వరం, షాద్‌నగర్ ఎస్‌ఓటీ బృందాలు రంగంలోకి దిగి రామో జీ రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గెట్ ఎదురుగా వాహన తనిఖీలు నిర్వహించాం. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, కారులోని బ్యాగులో నకిలీ రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి.
గత నెల రోజుల క్రితమే కుంట్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అసలు రూ.500 నోట్లను స్కా న్ చేసి, ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్ ద్వారా వాటి చిత్రాలను మార్పులు చేసి కలర్ ప్రింటర్ల సహాయంతో నకిలీ నోట్లను ముద్రించారు. ఇందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రధాన నిందితుడు యూట్యూ బ్ వీడియోలు, సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్నాడు.
ముద్రించిన నోట్లను లామినేషన్ చేసి, కత్తిరించి మార్కెట్‌లో చలామణి చేసేందుకు ప్ర ణాళిక రూపొందించుకున్నారు’ అని సీపీ వెల్లడించారు. నిందితులు తెలిపిన వివరాలతో కుంట్లూ రులోని అద్దె ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించి అక్కడ రూ.6.70 కోట్ల విలువైన 134 కట్టల నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాహనంలో లభించిన నోట్లతో కలిపి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నామని వెల్లడించారు.
ఏడుగురిలో నలుగురు అరెస్ట్
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీంప ట్నం మండలం ఉప్పరిగూడానికి చెందిన మడుపోజు కర్ణాకర్, కూకట్‌పల్లి, వివేకానందనగర్‌కు చెందిన చిన్నోళ్ల మాణిక్యరెడ్డి, జగిత్యాల జిల్లా ధ ర్మపురి మండలం కుసునూర్‌పల్లికి చెందిన చెరుకుపెల్లి రత్నాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా యె నుగొండకు చెందిన కరణం అజయ్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ లం పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన జెల్లి వెంకటేష్, భద్రాద్రి జిల్లా జూలురుపాడు మండలం సురా రం గ్రామానికి చెందిన కుంజా బాలరాజు, కంపాసటి శ్రీనివాస్ పరారీలో ఉన్నారు.
నకిలీ కరెన్సీ తయారీ, పంపిణీ వెనుక పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పట్టుకుంటామని సీపీ తెలిపారు. ఈ కేసును చేధించిన ఎస్‌వోటీ పోలీసులు సీపీ రివార్డులు అందజేశారు. ఈ మీడియా సమావేశంలో మహేశ్వరం డీసీపీ కె నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, షాద్‌నగర్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ భూపాల్, శ్రీధర్, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రాజు తదితరులున్నారు.
పోలీసులమంటూ వసూళ్లు
నకిలీ కరెన్సీ తయారీ ప్రయత్నాల్లో విఫలమైన సమయంలో నిందితులు మరో మార్గాన్ని ఎంచుకున్నట్లు తమ విచారణలో తేలిందని సీపీ వెల్లడిం చారు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలతో పోలీసులుగా నటిస్తూ కొనుగోలుదారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇద్దరు వ్యక్తుల నుం చి రూ.2 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున వసూలు చేసినట్టు తేలింది. అయితే అసలు రూ.500 తీసుకుని వాళ్లకు నకిలీ నోట్లు రూ.2 వేల చొప్పున ఇచ్చినట్లు తెలిసిందని తెలిపారు.