పిల్లల సినిమా కాదిది.. ఇద్దరు చిన్న హీరోలు నటించిన చిత్రం

04-11-2026 | 01:55am

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిల్డ్రన్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్(Summer Holidays)’. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. మాస్టర్ రోహన్(Master Rohan), మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 6న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను(Pre-release event) మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ధీరజ్ నాతో పాటు సినిమాలు చేశాడు. ఈ సినిమా బాగా వచ్చిందని విన్నా. సరిగ్గా లేని సీన్స్ మళ్లీ తీసుకోవడం గీతా ఆర్ట్స్‌లో అలవాటు. అదే ధీరజ్ ఫాలో అయ్యాడు. డైరెక్టర్ శ్రీకర్ ఈ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించాడని విన్నా. మంచి నోల్టాల్జిక్ ఫిలిం అనిపిస్తోంది” అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఈ సినిమాకు పనిచేసిన పిల్లలు చాలా టాలెంటెడ్‌గా ఉన్నారు, కాన్ఫిడెంట్‌గా వేదిక మీద మాట్లాడుతున్నారు.

వాళ్లను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎంత డబ్బున్న వారైనా ఒక్క ఏడాది వ్యవసాయం చేస్తే మన లైఫ్‌లో ఎంతో ప్రశాంతత వస్తుంది. ఈ సినిమా మనం మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంది. ఈ సినిమా ద్వారా మనల్ని, మన అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తారని నమ్ముతున్నా. ఇది చిన్న సినిమా, పిల్లల సినిమా అని ఎక్కడా అనిపించట్లేదు. ప్రొడ్యూసర్ ధీరజ్ నమ్మకం నిజం కావాలి. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ దీపావళికి ‘సమ్మర్ హాలీడేస్’ థియేటర్స్‌కు వెళ్లండి. ప్రేక్షకులంతా చిన్న పిల్లలైపోయి సినిమాను ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. “ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత నా ఫ్యామిలీకి ఈ సినిమా చూపించాలనిపించింది. ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తుందని అనుకుంటున్నా” అని తెలిపారు. చిత్ర దర్శకుడు శ్రీకర్ నయన్ మాట్లాడుతూ.. “ఈ పిల్లలతో ఇక ఉండలేనేమో అని బాధగా ఉంది. పిల్లల పేరెంట్స్ సపోర్ట్ వల్లే మూవీ చేయగలిగాం. నా యాక్టర్స్ అందరికీ ఈ సినిమాతో మరింత మంచి పేరొస్తుంది. జయసుధను అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ‘సమ్మర్ హాలీడేస్’ గుర్తుండిపోయే సినిమా, పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుంది” అన్నారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. “ఇది పిల్లల సినిమా కాదు పెద్దల సినిమా. కథ విన్నప్పుడు.. నా ఏజ్ గ్రూప్ వాళ్లు అందరూ కనెక్ట్ అవుతారని నమ్మా. సినిమా చూస్తున్నంత సేపు మీ బాల్యం గుర్తుకు వస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక చిన్ననాటి స్నేహితులకు ఫోన్స్ చేస్తారు. పిల్లలు నటించిన పెద్దల చిత్రమిది. పెద్దలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఏ పెద్ద చిత్రానికీ తీసిపోని కంటెంట్ మా మూవీలో ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరంతో ఒక మూవీ నిర్మించాలని ఉంది” అని తెలిపారు.

సహజ నటి జయసుధ మాట్లాడుతూ.. “ఈ పిల్లలు మాట్లాడే అందమైన మాటలు చూస్తుంటే మళ్లీ స్కూల్‌కు వెళ్లాలనిపిస్తోంది. ఈ సినిమాలో అమ్మమ్మ పాత్రలో నటించా. ఇది పిల్లల సినిమా కాదు ఇద్దరు చిన్న హీరోలు నటించిన సినిమా. పేరెంట్స్, అమ్మమ్మ, వేసవి సెలవులు.. ఈ అంశాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. 60స్ నా సమ్మర్ హాలీడేస్. అప్పుడైనా ఇప్పుడైనా వేసవి సెలవులు అందరికీ ఒక్కటే. అందరూ ఈ సినిమా చూడాలి. ధీరజ్ ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేయాలి. కొత్త దర్శకులకు, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలి.

పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చిన్న చిత్రాలు నిర్మించాలి. సినిమా హిట్ అయ్యాక చిన్నా, పెద్దా అనేది ఉండదు. ప్రేక్షకులు మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు. మాస్టర్ రోహన్ రాయ్ మాట్లాడుతూ.. “మా మూవీ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారు. జయసుధ గారితో నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. వాసుకి గారు, హర్షిణి గారితో నటిస్తున్నప్పుడు ఎంతో నేర్చుకున్నాను” అని తెలిపాడు. మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ.. “నేను ఎన్ని మూవీస్ చేసినా సమ్మర్ హాలీడేస్ నా మనసులో ప్రత్యేకంగా ఉండిపోతుంది.

హీరో బాలకృష్ణ ఆదిత్య 369లో ట్రావెల్ చేసినట్లు నాకు ఈ సినిమాతో 90’కు వెళ్లిన ఫీల్ కలిగింది. జయసుధ గారితో కలిసి నటించడం నా అదృష్టం” అని చెప్పాడు. ‘వింటర్‌లో రిలీజ్ అయ్యే ఈ సినిమా మళ్లీ సమ్మర్ వరకు థియేటర్లలో రన్ అవ్వాలని కోరుకుంటున్నాన’ని మాస్టర్ ప్రజ్వల్ తెలిపాడు. ఇంకా ఈ వేడుకలో అతిథులుగా విచ్చేసిన డైరెక్టర్లు రాహుల్ రవీంద్రన్, నందకిషోర్, రామ్ జగదీశ్, కౌశిక్‌తో పాటు నటీనటులు రాజీవ్ కనకాల, వాసుకి, రమణ భార్గవ్, మహేశ్ చింతల, అశోక్, హర్షిణి, చిత్ర సంగీత దర్శకుడు సింజిత్ యెమ్రల్లి, ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం, రైటర్ కొండల్ రావు, కొరియోగ్రాఫర్ సందీప్ కూడా మాట్లాడారు.

మరిన్ని వార్తలు