ఒంటిపూట కార్యదర్శులు!?
- మధ్యాహ్నానికే పంచాయతీ లకు తాళం
- జీపీఎస్ హాజరు ఉన్నా నిర్లక్ష్యం
హత్నూర, నవంబర్ 3: గ్రామస్థాయిలో ప్రభుత్వ పాలనకు కీలకమైన గ్రామపంచాయతీ కార్యదర్శుల(Gram Panchayat Secretaries) విధుల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన కొందరు కార్యదర్శులు(Secretaries) ఉదయం కార్యాలయాలకు వచ్చి హాజరు నమోదు(Attendance Recording) చేసుకున్న అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకే వెళ్లిపో తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధుల వేళల్లో కార్యాలయాలు మూతపడుతుండటంతో ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. హత్నూర మండలంలోని(Hathnoora Mandal) సాధుల్నగర్ గ్రా మపంచాయతీ కార్యాలయం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య మూసి ఉం డటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
కార్యదర్శుల విధులు ఎక్కడ?
కార్యదర్శులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు జీపీఎస్ హాజరు నమోదవుతున్నా కార్యాలయాల్లో ఎందుకు అందుబాటులో ఉండటం లేదు? అన్న ప్రశ్నలు గ్రామస్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శుల బాధ్యతలు కేవలం హాజరు నమోదుకే పరిమితం కావు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూళ్లు, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణతోపాటు ప్రజల సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి.
అయితే కార్యాలయాలు మధ్యాహ్నానికే మూతపడితే ప్రజలకు సేవలందించేది ఎవరు? అత్యవసర పనులపై కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఎవరిని సంప్రదించాలి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంకు పని ఉందంటూ ఉదయం నుండి కార్యదర్శి సాధుల్నగర్ గ్రామపంచాయతీ కార్యాలయం మూసి ఉండటంపై సంబంధిత కార్యదర్శిని వివరణ కోరగా, బ్యాంకు ఖాతాకు సంబంధించిన పని విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అయితే ఆ సమయంలో ఆయన ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? బ్యాంకు పని అధికారిక విధుల్లో భాగమా? కార్యాలయం నుంచి బయటకు వెళ్లే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అధికారిక పనిమీద బయటకు వెళ్లినా ప్రజలకు కార్యాలయంలో సేవలు అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయా? అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కార్యదర్శి ఇచ్చిన వివరణతో కార్యాలయం మూసి ఉన్న అంశంపై తలెత్తిన ప్రశ్నలకు పూర్తిస్థాయి సమాధానం లభించాల్సి ఉంది.
స్పష్టమైన బాధ్యతలు.. పర్యవేక్షణ ఏదీ?
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం2018లోని సెక్షన్ 43 ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు అనేక విధులు, బాధ్యతలు నిర్దేశించారు. సెక్షన్ 43(8) ప్రకారం గ్రామపంచాయతీ సమర్థవంతమైన నిర్వహణ కోసం కార్యదర్శి గ్రామంలోనే నివసించాలి. లేదా అందుబాటులో దగ్గరగా ఉండాలి. వారి విధుల పనితీరు నివేదికను ప్రతి నెలా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. నిబంధనల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీని కనీసం మూడు నెలలకోసారి తనిఖీ చేయాలి.
మండల స్థాయిలో విస్తరణ అధికారి అన్ని గ్రామపంచాయతీలను మూడు నెలలకోసారి తనిఖీ చేయడంతోపాటు, జిల్లా పంచాయతీ అధికారి నెలకు కనీసం ఐదు గ్రామపంచాయతీలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. సాధారణ తనిఖీలతోపాటు ఆకస్మిక తనిఖీలకూ చట్టం అవకాశం కల్పించింది.
మరి ఈ నిబంధనలు హత్నూర మండలంలో ఎంతవరకు అమలవుతున్నాయి? కార్యదర్శుల జీపీఎస్ హాజరు వివరాలు, క్షేత్రస్థాయి విధుల నిర్వహణ, కార్యాలయాల పని వేళలను అధికారులు పరిశీలిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా జిల్లా పంచాయతీరాజ్ అధికారులు స్పందించి మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. గ్రామపంచాయతీ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే కేంద్రాలుగా ఉండాలే తప్ప, మధ్యాహ్నానికే తాళాలు పడే పరిస్థితి ఉండకూడదని ప్రజలు కోరుతున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
పంచాయతీ కార్యాలయ వేళల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండాలి. కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ ఉదయం విధులకు హాజరై కార్యాలయ పనులు నిర్వహించాలి. అత్యవసర పనులు ఉంటే తప్ప మధ్యాహ్నం వరకు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశాం. బ్యాంకు పనులు, ఇతర కారణాలతో మధ్యాహ్నమే కార్యాలయాలకు తలుపులు మూసి వేసి వెళ్లడం నిబంధనలకు విరుద్ధం. ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఇన్చార్జి ఎంపీడీవో యూసుఫ్