తల్లి బిడ్డల సంరక్షణే లక్ష్యం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో(Government General Hospital) ప్రసవం చేసుకున్న మహిళలకు నవజాత శిశువుల సంరక్షణ కోసం తన సొంత నిధులతో యెన్నం హెల్త్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్ 14న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆసుపత్రిలో పలువురు బాలింతలకు హెల్త్ కిట్లను పంపిణీ చేశారు.
పేద కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు తల్లులు, శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల మెరుగుదలకు, వైద్యుల కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్వేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.