చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యం: CDPO విష్ణుప్రియ
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యమని, చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు – ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలు బాటలు వేస్తున్నాయని CDPO విష్ణుప్రియ అన్నారు. శనివారం మంచిర్యాల ప్రాజెక్ట్ పరిధిలోని రాంనగర్ సెక్టార్ ముస్లిం బస్తీ–1 అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్ కార్యక్రమానికి సూపర్వైజర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ స్వరూప లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సి డి పి ఓ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం, ప్రాథమిక విద్య ఎంతో అవసరమని తెలిపారు. ఆరు నెలల వయస్సు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు తగిన అనుబంధ ఆహారాన్ని అందించడం ద్వారా చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు.
చిన్న వయస్సు నుంచే పిల్లలలో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు అక్షరాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుందని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలను గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కాంతకృష్ణ, ఆయా మంజుల, తల్లులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.