మహిళా సంఘాల బలోపేతానికి గ్రామ సమాఖ్య భవనం
బుయ్యారంలో నిర్మాణ పనులకు మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ శ్రీకారం
వేమనపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామంలో మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా మంజూరైన గ్రామ సమాఖ్య (VO) భవన నిర్మాణానికి(VO Building Work) మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఆర్.సంతోష్ కుమార్(Former ZPTC R.Santosh Kumar) భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు సర్పంచ్ కొండి మానస–శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ... మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక స్వావలంబనకు చోదకశక్తులని, గ్రామ సమాఖ్య భవనం అందుబాటులోకి వస్తే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, సంఘాల కార్యకలాపాలకు మరింత వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు.
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని, మహిళా సాధికారతతోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, వెలుగు ఐకేపీ ఏపీఎం ప్రమోద్, మైనార్టీ నాయకుడు సాబీర్ అలీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి మధు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.