పెండింగ్ దరఖాస్తులు వేగవంతం చేయాలి
రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్
నస్పూర్, (విజయక్రాంతి) : భూదాన్ భూములు, రీ సర్వే, భూభారతి పెండింగ్ దరఖాస్తుల(Bhu-Bharati Pending Application) పరిష్కారం వేగవంతం చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్(Commissioner Lokesh Kumar) అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), కలెక్టరేట్ పరిపాలన అధికారులతో భూధాన్ భూములు,
రీ సర్వే ప్రక్రియ, కోర్టు కేసులు, భూ సేకరణ, జి.ఓం. 59, 76, 118 ల సంబంధిత పెండింగ్ దరఖాస్తులు, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, విజిలెన్స్, ఇంటలిజెన్స్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ మాట్లాడుతూ భూదాన్ భూములకు సంబంధించిన నివేదిక, భూముల రీసర్వే ప్రక్రియ పురోగతి, న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత కేసులు, భూసేకరణ అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు.
యు ఎల్ సి భూములు, జి.ఓ. 59, 76, 118 కింద పెండింగ్‌లో ఉన్న క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించి సంబంధిత దరఖాస్తులను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి, రికార్డులను అనుసరించి వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన కేసుల పురోగతి వేగవంతం చేయాలని,
భూ పరిపాలనకు సంబంధించిన పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించి, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలలో రీ సర్వే పనులు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని, భూభారతి పెండింగ్ దరఖాస్తులు నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే, బి, డి సెక్షన్ల సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.