శ్రీనగర్ వేదికగా థాంగ్-టా సమరం..
ఐపీఎస్ విద్యార్థుల సత్తా
సుల్తానాబాద్, సెప్టెంబరు 29 (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ వేదికగా జరుగుతున్న జాతీయ స్థాయి థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ పోటీ(National-level Thang-Ta martial Arts Competition)ల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల (ఐపీఎస్) విద్యార్థులు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో నలుగురు విద్యార్థులు వివిధ విభాగాల్లో బరిలోకి దిగారు. ఏ. అద్వైత్ 56 కేజీల విభాగంలో, ఎం. సంప్రీత్ 46 కేజీల విభాగంలో, కె. మైత్రి వరుణ్ 52 కేజీల విభాగంలో, టి. ధనుష్‌కుమార్ 56 కేజీల విభాగంలో పోటీల్లో పాల్గొంటున్నారు.
జాతీయ స్థాయిలో తెలంగాణ తరఫున తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సత్తా చాటుతున్నారు.విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం పట్ల పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్‌కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేశారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొంటూ.. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.