విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
చట్టాలపై ప్రతి విద్యార్థికి అవగాహన తప్పనిసరి-జూనియర్ సివిల్ జడ్జి పి. రవి
కోటపల్లి,( విజయక్రాంతి ) : విద్యార్థి(Student) దశలోనే మత్తు పదార్థాలకు(Narcotic substances) బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, చట్టాలపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు పి. రవి సూచించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా NDPS చట్టం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై విధించే శిక్షలను వివరించారు.
అలాగే బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంపై(POCSO acts) అవగాహన కల్పిస్తూ, వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటి అక్రమ కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రాజశేఖర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వసతి గృహ అధికారి శ్రీనివాస్,న్యాయవాదులు మహేష్, పున్నం, సంజీవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.