సామాజిక సమస్యలపై అవగాహన కల్పించేలా
- ‘రైతుకు రక్షణ’ లఘు చిత్రం రూపకల్పన
- వీక్షించిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): సమాజంలో నెలకొన్న భూ వివాదాలు, వాటి కారణంగా కుటుంబాల మధ్య తలెత్తుతున్న సమస్యలపై సామాజిక దృక్పథంతో అవగాహన కల్పించేలా ‘రైతుకు రక్షణ’(Raithuku Rakshana) పేరిట దర్శకుడు నాగరాజు(Director Nagaraju) రూపొందించిన లఘు చిత్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) గురువారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరావు దేశ్పాండే, జైపూర్ మండల తహసిల్దార్ వనజారెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా భూములకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో భూ సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో సామాజిక సందేశాత్మకంగా లఘు చిత్రాన్ని రూపొందించడం సంతోషకరమని తెలిపారు. సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్వహించిన భూ సర్వే ఆధారంగా రూపొందిన రెవెన్యూ రికార్డులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, దీనివల్ల వారసత్వంగా సంక్రమించిన భూముల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
భూ వివాదాలకు సంబంధించిన కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యాయస్థానాలలో వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందని, కుటుంబ సభ్యులందరూ పరస్పర అంగీకారంతో ఒకే నిర్ణయానికి వచ్చి భూముల పంపిణీ చేసుకుంటే వివాదాలను సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. భూముల పంపిణీ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం లఘు చిత్ర దర్శకుడు నాగరాజు రూపొందించిన ‘రైతుకు రక్షణ’ లఘు చిత్ర గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగరాజును శాలువాతో సత్కరించి అభినందించారు.