చదువుతో పటు సేవాభవం...

27-11-2026 | 10:06pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని రివిలేషన్ హైస్కూల్(Revelation High School) యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న షేక్ అమెర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని అతడి వైద్య ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఫోన్‌పే ద్వారా కొంత, నగదు రూపంలో మరికొంత మొత్తాన్ని విద్యార్థి కుటుంబానికి అందజేశారు.

విద్యార్థి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి అండగా నిలవడం అభినందనీయమని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నూతన విద్యావిధాన అధ్యయన యాత్రలో ఉన్న రివిలేషన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు.

విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు దయ, కరుణ, సేవాభావం, సామాజిక బాధ్యత వంటి మానవీయ విలువలను నేర్పడం విద్యాసంస్థల బాధ్యతని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, ఇతరుల బాధను అర్థం చేసుకోవడమే నిజమైన విద్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మద్దెర్ల ప్రశాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు