ఎండిపోయిన పొలాలను పరిశీలించిన నాయకులు
రైతులతో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్
దండేపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో(Narsapur Village) నెర్రెలు బారిన, ఎండిపోయిన పంట పొలాలను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు(BRS Party State-level Leaders) నడిపెల్లి విజిత్ కుమార్ గురువారం రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజక వర్గంలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో నీరు లేక 80% పొలాలు ఎండిపోయాయని, పొలాలు మొత్తం నెర్రలు బారాయన్నారు. బీ ఆర్ ఎస్ హయాంలో, దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ముందు చూపుతో నీటిని విడుదల చేసి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చేశారని గుర్తు చేశారు.
మంచిర్యాల నియోజక వర్గంలో పొలాలు ఎండిపోవడానికి కారణం మంచిర్యాల ఎమ్మెల్యే అసమర్థ పాలనే అని, అయన వల్లనే దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో వేల ఎకరాలు ఎండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు నీరు ఇద్దామని ఆలోచన ఎం ఎల్ ఏ కు ఉంటే కడెం ప్రాజెక్టు ద్వారా, గూడెం లిఫ్ట్ ద్వార నీటిని ఇవ్వచ్చు కానీ నీరు విడుదల చేయకుండా రైతులను గోసపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ కాలేశ్వరం మీటర్లు ఆన్ చేయండని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా నీటిని విడుదల చేయడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని అన్నారు. రైతుకు 24 గంటలు కరెంటు కేసీఆర్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రోజుకు ఆరు గంటలు మాత్రమే ఇస్తుందని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే తన వ్యక్తిగత గొడవలను పక్కనపెట్టి ప్రజల కోసం, రైతుల కోసం పనిచేయాలని సూచించారు. మంచిర్యాల నియోజకవర్గ రైతాంగానికి ఇప్పటికైనా నీటిని అందించాలని, పంటలు పూర్తిగా ఎండిపోకుండా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులతో మాట్లాడిన కేటీఆర్...
పంట ఎండిపోయిందని బాధతో ఇటీవల నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు తన పొలానికి నిప్పు అంటించిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సాపూర్ గ్రామ రైతులతో ఫోన్ లో మాట్లాడుతూ ఎవరు అధైర్య పడద్దని రాబోయేది మళ్లీ కేసిఆర్ ప్రభుత్వమేనని అన్నారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రైతులకు ధైర్యం ఇచ్చారు. రైతులందరూ ధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.