కాంగ్రెస్ తోనే ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ

07-10-2026 | 03:10pm
  1. బాణం గుర్తుపై ఓటేసి TWU–INTUC అభ్యర్థులను గెలిపించాలి
  2. మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkatswamy) స్పష్టం చేశారు. బుధవారం ఆయన నివాసంలో ఆర్టీసీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU), INTUC కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో కార్మికులు బాణం గుర్తుపై ఓటు వేసి TWU–INTUC కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు TWU అభ్యర్థుల విజయానికి కాంగ్రెస్ శ్రేణులు అన్ని స్థాయిల్లో కృషి చేస్తున్నాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాంగ్రెస్–INTUC–TWU కూటమికి కార్మికులు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే చేపడతామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను మంజూరు చేసి కార్మికులకు అందించామని ఆయన గుర్తుచేశారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు భవిష్యత్తులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని తెలిపారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

మంచిర్యాల ప్రాంతంలోని ఆర్టీసీ కార్మికులు బాణం గుర్తుపై ఓటు వేసి TWU–INTUC అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్, ఆర్టీసీ నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు