ఘనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ
అక్రా: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(External Affairs Minister S. Jaishankar) ఘనా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి సామ్యూల్ ఒకుడ్జెటో అబ్లాక్వా(Foreign Minister Samuel Okudzeto Ablakwa)తో సమావేశమయ్యారు. అక్రాలో జరిగిన ఈ భేటీలో భారత్-ఘనా ద్వైపాక్షిక సంబంధాలను(India-Ghana Bilateral Relations) మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి సహకారం, ఔషధ రంగం, సామర్థ్య నిర్మాణం, రక్షణ, సాంకేతికతతో పాటు ప్రజల మధ్య సంబంధాలను విస్తరించే అంశాలు చర్చకు వచ్చినట్లు జైశంకర్ తెలిపారు. భారత్, ఘనా రెండూ గ్లోబల్ సౌత్ భాగస్వాములు(Global South partners)గా ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలు, చారిత్రక అనుబంధాన్ని పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా బహుపాక్షిక వేదికల్లో సహకారం, ఆఫ్రికన్ యూనియన్, ECOWASతో భారత్ అనుసంధానాన్ని మరింత పెంచే అంశాలపై కూడా ఇరువురు చర్చించారు. జైశంకర్ అక్టోబర్ 6 నుంచి 10 వరకు ఘనా, కోట్ డి ఐవోర్, ఇథియోపియా పర్యటనలో ఉన్నారు. ఘనా పర్యటన అనంతరం ఆయన తదుపరి ఆఫ్రికా దేశాలకు వెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ నుంచి బహుపాక్షిక సహకారం వరకు భారత్-ఘనా భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా జైశంకర్ పర్యటన సాగుతోంది.