ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభం
మల్లాపూర్, అక్టోబర్ 07 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar), జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satyaprasad), వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావు కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆరోగ్య ఉపకేంద్రం ద్వారా స్థానికులకు ప్రాథమిక చికిత్స, ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించుకోవాలని సూచించారు.
కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది పనిచేయాలని సూచించారు. జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ ఉపకేంద్రం ఏర్పాటుతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహారావు, డీఎంహెచ్‌ఓ సుజాత, అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.