సమాజంలో పాత్రికేయుల పాత్ర మరువలేనిది
మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య
లక్షేట్టిపేట, నవంబర్ 18( విజయక్రాంతి): సమాజంలో పాత్రికేయుల(Journalists) పాత్ర మరువలేనిదని ఆర్యవైశ్య మహాసభ(Arya Vysya Mahasabha) రాష్ట్ర ముఖ్య సలహాదారు, మాజీ మున్సిపల్ చైర్మన్(Former Municipal Chairman) నల్మాస్ కాంతయ్య, జిల్లా అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక ఆర్యవైశ్య భవన్ లో జర్నలిస్టు డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది పాత్రికేయులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైందని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, నిజాన్ని నిర్భయంగా రాస్తూ సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు పాటు పడుతున్నారని అన్నారు. జర్నలిస్టులు కూడా ఐక్యతతో ముందుకు పోయి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.
పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నరేందుల సాహితి మాట్లాడుతూ సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజలకు నిజా నిజాలను తెలియజేయడంలో పాత్రికేయుల బాధ్యత ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్ మాట్లాడుతూ సమాజంలో అన్యాయానికి గురవుతున్న నిరుపేదలకు జర్నలిస్టులు అండగా నిలుస్తున్నారని వారి సమస్యలను వార్తల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తుండడం హర్షనీయమన్నారు. అనంతరం జర్నలిస్టులను మహిళా సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెర్ల ఆరతి, కోశాధికారి కాసం స్వప్న, పట్టణ సంఘం అధ్యక్షులు చెట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి నల్మాస్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓజ్జల శ్రీనివాస్, కోశాధికారి నరేందుల రమేష్,
మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గౌరిశెట్టి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొంజర్ల ప్రసాద్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పిఆర్ఓ కొంజర్ల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులు గడ్డం వికాస్ ప్రధాన కార్యదర్శి రంజిత్ , జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి బొద్దుకూరి రాజ్ కుమార్, మహిళా సంఘం, గౌరవ సలహాదారులు ఉత్తూరు రజిత, చెట్ల రమ్య తదితరులు పాల్గొన్నారు.