ప్రాంతస్థాయి ఆర్చరీ, అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం!

27-11-2026 | 10:07pm

ఘట్ కేసర్, నవంబర్ 27 (విజయక్రాంతి) : వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంతం(Vanavasi Kalyan Parishad, Telangana Region) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాంత స్థాయి ఆర్చరీ, అథ్లెటిక్స్ పోటీలు ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి, అన్నోజిగూడ లోని  రాష్ట్రీయ విద్యా విహార్ పాఠశాలలో(Rashtriya Vidya Vihar School) శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత శ్రీ రమేష్, అఖిల భారతీయ శిక్షా టోలి సభ్యులు మాననీయ కొరిగింజా రామచంద్రయ్య, ప్రాంత క్రీడా ప్రముఖ్  సత్యనారాయణ, క్షేత్ర సంఘటన మంత్రి  శివరామకృష్ణ, ప్రాంత సంఘటన మంత్రి  వేముల ఆంజనేయులు, అలాగే తెలంగాణలోని 8 జిల్లాల నుంచి విచ్చేసిన ఆదివాసీ క్రీడాకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత శ్రీ రమేష్  మాట్లాడుతూ ఆదివాసీ పిల్లల్లో పుట్టుకతోనే క్రీడా నైపుణ్యాలు ఉంటాయని, ముఖ్యంగా విలువిద్యలో చిన్నప్పటి నుంచే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారని పేర్కొన్నారు. నగర ప్రాంతాల పిల్లలతో పోలిస్తే ఆదివాసీ పిల్లల్లో సహజసిద్ధమైన క్రీడా నైపుణ్యాలు ఎంతో ఉన్నాయని తెలిపారు.  ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.

మాననీయ కొరిగింజా రామచంద్రయ్య  మాట్లాడుతూ వనవాసుల సమగ్ర వికాసం కోసం వనవాసి కళ్యాణ పరిషత్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈపోటీల ద్వారా ఆదివాసీ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు