ఘట్ కేసర్ బస్టాండ్ లో మూసివేసిన మరుగుదొడ్లు
'నీళ్లు లేవు.. రేపు రాగలరు' బోర్డు తగిలింపు
ఘట్ కేసర్, నవంబర్ 10 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి మొదలైందనడానికి ఘట్ కేసర్ బస్టాండ్(Ghatkesar Bus Stand) పరిస్థితి నిదర్శనంగా నిలుస్తోంది. 'నీళ్లు లేవు.. బంద్.. రేపు రాగలరు' అంటూ బాత్ రూమ్ కు నోటీసులు పెట్టడం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వేలాది మంది రాకపోకలు సాగించే బస్టాండ్ లో కనీస వసతులు కరవవడంపై ప్రయాణికులు, స్థానికులు మండిపడుతున్నారు.
నీటి కొరతను సాకుగా చూపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు రాకపోకలు సాగించే బస్టాండ్ కు కనీసం మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఘట్ కేసర్ ఒక సర్కిల్ గా ఏర్పడినప్పటికీ ఇక్కడి ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో పలు ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉండటంతో విద్యార్థులకు బస్టాండ్ ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి కీలక ప్రాంతంలో కొరతతో మరుగుదొడ్లు మూసివేయడం ఇబ్బందికరంగా మారింది.