డంప్ యార్డ్ సమస్య మూడు ప్రధాన పార్టీల పాపమే
కరీంనగర్ సిటీ నవంబర్10 (విజయక్రాంతి) : ఆరోగ్యాలతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్(BJP, Congress, BRS) మూడు ప్రధాన రాజకీయ పార్టీలు(Political Parties) చెలగాటమాడుతున్నాయని తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్(Karimnagar Dumping Yard) సమస్యకు ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న పార్టీలు శాశ్వత పరిష్కారం చూపలేకపోయాయని విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారం మారుతున్నా, నాయకులు మారుతున్నా డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. దుర్వాసన, కాలుష్యంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులకు పట్టింపు లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డంపింగ్ యార్డ్ తరలింపుపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సమస్యకు పరిష్కారం చూపలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. డంపింగ్ యార్డ్‌ను సందర్శించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను తీసుకొచ్చినా సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.
రీసైక్లింగ్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం కాకుండా డంపింగ్ యార్డ్ తరలింపుతో శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమయ్యే వరకు తెలంగాణ రక్షణ సేన ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, జిల్లా కమిటీ సభ్యురాలు కొర్మి పద్మ, జిల్లా అధికార ప్రతినిధి కుతాడి శ్రీనివాస్, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నం శిరీష, జిల్లా ఎంబీసీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాముల రమేష్, దీటి రమేష్, బీసీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బసవేణి రాజేందర్, జిల్లా సీనియర్ నాయకులు గర్షకుర్తి విద్యాసాగర్, యువజన విభాగం నాయకులు రాగతి సందీప్, నునుగొండ పవన్ తదితరులు పాల్గొన్నారు.