ఐలాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
టూరిజం నోడల్ అధికారి డా. ధర్మ నాయక్
వెంకటాపూర్, నవంబర్ 10 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రామప్ప సరస్సు ఐలాండ్(Ramappa Lake Island)లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టూరిజం నోడల్ అధికారి డా. ఏ.ధర్మ నాయక్ సూచించారు. మంగళవారం ఆయన రామప్ప సరస్సు ఐలాండ్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు పూర్తయిన పనులను పరిశీలించడంతో పాటు, నాణ్యతా ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేశారు. మిగిలి ఉన్న పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. రామప్ప సరస్సు ఐలాండ్ అభివృద్ధి పనులు పూర్తయితే పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, రామప్ప పర్యాటక ప్రాంతానికి మరింత ఆకర్షణ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టూరిజం ఏఈ విజయ్, టూరిజం గైడ్ విజయ్, హరిత హోటల్ సిబ్బంది రాకేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.