ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదు
డీఎండబ్ల్యూఓపై చర్యలు తీసుకోవాలి
అధికారుల తీరుపై మండిపడ్డ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రోటోకాల్ పాటించకుండా, ప్రజాప్రతినిధులను విస్మరించడం సరికాదని మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్(Municipal Chairman Mengre Akash), వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా, స్థానిక ఎమ్మెల్యేను సైతం ఆహ్వానించకుండా కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించకుండా, జాబితాను గోప్యంగా ఉంచడంపై ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన డీఎండబ్ల్యూఓపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణ, నాగుబాయి, దూడల లక్ష్మి, జెబా షేక్, బీఆర్ఎస్ నాయకుడు సాయి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.