రేషన్ లబ్ధిదారులకు శుభవార్త!

30-10-2026 | 05:00am
  1. మరో ఆరు నిత్యావసర సరుకులు
  2. సబ్సిడీపై పంపిణీ సర్కార్ సూపర్ ప్లాన్
  3. వచ్చే సంక్రాంతి నుంచి పంపిణీ చేసే యోచన
  4. ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు

సికింద్రాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల(Essential Commodities) ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మరింత ప్రయోజనం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

ప్రస్తుతం రేషన్ దుకాణాల(Ration Shop) ద్వారా బియ్యం మాత్రమే పొందుతున్న లబ్ధిదారులకు అదనంగా మరో ఆరు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట కల్పించడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

బియ్యంతో పాటు పంపిణీ చేయాలని పరిశీలిస్తున్న సరుకులు ఇవే..

ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ప్రతిపాదన ప్రకారం రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు కందిపప్పు, పామాయిల్, చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండిని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సరుకులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలా? ఒక్కో కుటుంబానికి ఎంత పరిమాణంలో అందించాలి? అనే అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

సంక్రాంతి నుంచి అమలయ్యే అవకాశాలు! 

ఈ ప్రతిపాదనకు సంబంధించి సరుకుల సేకరణ, నిల్వలు, రవాణా, పంపిణీ విధానం, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని అంచనా వేస్తున్నారు. అన్ని అంశాలు అనుకూలంగా ఉంటే వచ్చే సంక్రాంతి నాటికి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, పథకం ప్రారంభ తేదీ, సరుకుల పరిమాణం, ధరలు, అర్హతలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

3.42 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం..

తెలంగాణలో సుమారు 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల పరిధిలో 3.42 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇతర నిత్యావసర వస్తువులను కూడా రేషన్ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తే మార్కెట్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు కొంత ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం ఉంది. వర్షాభావం వల్ల పంటల దిగుబడి తగ్గి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవు తోంది.మరోవైపు, రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వలను పటిష్ఠం చేయడంతో పాటు భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు ఎదురైనా రేషన్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అధికారిక ప్రకటన కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు..

రేషన్ ద్వారా అదనపు నిత్యావసర సరుకుల పంపిణీ ప్రతిపాదన అమల్లోకి వస్తే కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఇది పరిశీలన దశలోనే ఉంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఏయే సరుకులు, ఎంత పరిమాణంలో ఏ ధరలకు పంపిణీ చేస్తారనే అంశాలపై స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు