ఇక గ్లామర్ బొమ్మను కాను!

10-10-2026 | 05:25am

బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిశా పటానీ(Bollywood star beauty Disha Patani) హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కెరీర్ తదుపరి దశలో కేవలం ఒకే రకమైన ఇమేజ్ లేదా గ్లామర్ పాత్రలకే పరిమితం కాకూడదని, నటనకు ప్రాధాన్యమున్న విభిన్న పాత్రలను ఎంచుకుంటానని స్పష్టం చేసింది.

“పరిశ్రమలో నాకున్న గ్లామర్ బొమ్మ అనే ముద్రను దాటి, నటనకు ఆస్కారమున్న క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాల్లో భాగం కావాలనుకుంటున్నా. శారీరక ఆకృతి లేదా గ్లామర్‌కు ప్రాధాన్యత లేని, కథను ముందుకు నడిపించే సవాలుతో కూడిన పాత్రలు చేయడమే నా తదుపరి లక్ష్యం. ఒక నిర్దిష్టమైన పాత్ర లేదా ఇమేజ్‌తో గుర్తింపు పొందాలని అనుకోవడం లేదు. భవిష్యత్తులో సైకలాజి కల్ డ్రామాలు, క్యారెక్టర్ డ్రివెన్ థ్రిల్లర్లు, విభిన్నమైన యాక్షన్ చిత్రాలలో నటిం చాలని ఆశపడుతున్నా” అని తెలిపింది.

ఇక తన మొదటి సినిమా అనుభవాలు పంచుకుంటూ.. “నా మొదటి హిందీ చిత్రం ‘ఎమ్‌ఎస్ ధోని: ది అన్టోల్ స్టోరీ’ (2016) సమయంలో సెట్ ఎలా పనిచేస్తుంది, కెమెరాను ఎలా ఫేస్ చేయాలి, క్యారెక్టర్‌ను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలపై కనీస అవగాహన ఉండేది కాదు. కేవలం నా సహజ ప్రవృత్తితోనే నటించా. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో నటనపై అవగాహన పెరిగింది, ఇప్పుడు నన్ను నేను ఎక్కువగా నమ్ము తున్నా.

నటన పట్ల నాకున్న జిజ్ఞాసను ఎప్పటికీ కోల్పోకూడదన్న భయం, ప్రతి కొత్త పాత్రను చేసేటప్పుడు ఉండే సందిగ్ధతే నాలో ఉత్సాహాన్ని నింపుతుంది. నాకు అన్నీ తెలుసు అనే స్థితికి నేనెప్పుడూ చేరుకోవాలనుకోను. రాబోయే కాలంలో మరింత రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. వివిధ భాషలకు చెందిన భిన్నమైన దర్శకులతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నా” అని చెప్పు కొచ్చింది దిశా పటానీ.

ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. తెలుగు చిత్రం ‘లోఫర్’ (2015) ద్వారా కెరీర్ ప్రారంభించిన దిశా పటానీ, ‘కల్కి 2898ఏడీ’ (2024)లో కనిపించింది. ప్రస్తుతం ఆమె ‘ఆవారాపన్ 2’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ చిత్రాలతోపాటు, కెవిన్ స్పేసీ సరసన ‘ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ అనే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

మరిన్ని వార్తలు