బీజేపీ నేతలతో మహ్మద్ షమీ భేటీ.. అక్కడి నుంచే పోటీ.?

29-11-2026 | 04:47pm

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో షమీ సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మైనారిటీ మోర్చా నాయకుడు కున్వర్ బాసిత్ అలీతో షమీ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం (Meeting) రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దింపే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.

ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి (Politics) ప్రవేశిస్తే మైనారిటీ మోర్చాలో జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అంతర్జాతీయ క్రికెట్‌లో తన బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షమీ ఇప్పుడు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారా? బీజేపీ (BJP) కండువా కప్పుకోనున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన రాజకీయ ప్రవేశంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు