సినిమా పైరసీ దందా.. ఒక్కో సినిమాకు రూ.20 వేలు

21-11-2026 | 07:52pm

హైదరాబాద్: కొత్త సినిమాల విడుదలతోనే పైరసీకి తెరలేపుతున్న ముఠాపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Telangana Cyber Security Bureau) (TGCSB) పోలీసులు కొరడా ఝళిపించారు. థియేటర్లలోనే సినిమాలను రహస్యంగా చిత్రీకరించి, ఆన్‌లైన్‌లో లీక్ చేస్తున్న నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 19 ఏళ్ల ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూలులోని ఎస్‌వీసీ సినిమాస్‌లో కొత్తగా విడుదలైన చిత్రాలను మొబైల్ ఫోన్లతో రికార్డ్ చేసి, ఆ వీడియోలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పైరసీ వెబ్‌సైట్ల(Movie Piracy Websites)కు చేరవేసేవారు. ఈ వ్యవహారాన్ని టెలిగ్రామ్ ద్వారా మరో వ్యక్తి సమన్వయం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ అక్రమ వ్యవహారంలో ఒక్కో సినిమాను రికార్డ్ చేసి పంపినందుకు నిందితులకు రూ.20 వేల చొప్పున క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) రూపంలో చెల్లింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

'రామాయణ', 'సీన్', 'మహాశక్తి', 'ENE', 'ఆకాశంలో ఒక తార', 'OM', 'కల్ట్', 'ఆదర్శ కుటుంబం' సహా పలు చిత్రాలను అక్రమంగా రికార్డ్ చేసి పంపిణీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

TGCSB, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber of Commerce) సంయుక్తంగా ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ యూనిట్ సినిమా పైరసీపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 42,151 పైరసీ URLలను బ్లాక్ చేయడంతో పాటు 87 నోటీసులు జారీ చేసింది. ఎనిమిది మంది అనుమానితులను గుర్తించి, ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ చర్యలతో 20కి పైగా సినిమాలకు సంబంధించి సుమారు రూ.33.6 కోట్ల మేర సినీ పరిశ్రమకు కలగాల్సిన నష్టాన్ని నివారించినట్లు TGCSB తెలిపింది. పైరసీ వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు, క్రిప్టో లావాదేవీలు, ఇతర నెట్‌వర్క్ సభ్యులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు