వినూత్న ఆలోచనలకు నిపుణుల మార్గదర్శకత్వం
జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి
ములుగు,(విజయక్రాంతి): గ్రామీణ ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా తీర్చిదిద్దుకునేందుకు ఇన్నోవేషన్ పంచాయతీ(Innovation Panchayat) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి(District Industries Department General Manager Siddhartha Reddy) సూచించారు. గురువారం ములుగు జిల్లా(Mulugu District)లో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమానికి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లోని ఆవిష్కర్తలు, యువత, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు తమ సృజనాత్మక ఆలోచనలకు ఆచరణ రూపం కల్పించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అందిస్తున్నఅవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 40 మందికి నిపుణులు ముఖాముఖి మార్గదర్శకత్వం అందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలను కలుపుతూ తొమ్మిది విడతల్లో నిర్వహించిన ఇన్నోవేషన్ పంచాయతీ ద్వారా 800కు పైగా ముఖాముఖి సంప్రదింపులు నిర్వహించడంతో పాటు 70 మందికి పైగా స్థానిక మెంటార్లను గుర్తించి అనుసంధానం చేశారు. ములుగులో నిర్వహించిన తొమ్మిదో విడతతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ సోహెల్ ఖాన్, గ్రాస్రూట్ ఇన్నోవేషన్స్ విభాగం లీడ్ రమేష్ గౌడ్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.