మంగపేట పంచాయతీలో అక్రమాలపై చర్యలేవీ?
మంగపేట, నవంబర్ 28 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట గ్రామ పంచాయతీలో జరిగిన అవకతవకలు, అక్రమాలు వెలుగులోకి వచ్చి నెల రోజులు దాటినా బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రికార్డులు, రిజిస్టర్లతో పాటు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పేరు ఒకరిదిగా ఉండగా, చెల్లింపులు మాత్రం మరో అధికారి పేరుతో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా, విధులు నిర్వహించని అధికారి పేరుతో నిధులు చెల్లించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది.
ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో పాటు మంగపేట గ్రామానికి చెందిన పలువురు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)కు ఫిర్యాదు చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనూ ఫిర్యాదులు అందజేశారు. దీంతో అక్టోబర్ 9న మంగపేట ఎంపీఓ మహేందర్ గ్రామ పంచాయతీ రికార్డులను సీజ్ చేశారు. అక్టోబర్ 26న ములుగు డివిజనల్ లెవల్ పంచాయతీ అధికారి (DLPO) శ్రీధర్ ఆ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారుల తీరుపై అనుమానాలు
గ్రామ పంచాయతీ నిధుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు స్పష్టంగా వెలుగులోకి వచ్చినా జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈఓ తదితర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ పురోగతి, బాధ్యులపై తీసుకున్న చర్యలను అధికారికంగా వెల్లడించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో జిల్లా స్థాయి అధికారి ఒకరు అక్రమాలకు పాల్పడిన వారికి అండగా నిలుస్తున్నారని, ఓ జాతీయ పార్టీకి చెందిన ఇద్దరు జిల్లా స్థాయి నాయకులు తమకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.
కమిషనర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
మంగపేట గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగ ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పందించాలని వీడీసీ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారితో పాటు వారికి సహకరించిన వారిపైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.